calender_icon.png 2 August, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఎంతో ఉపయోగం

01-08-2025 10:35:36 PM

పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి..

పరకాల/హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): గురువారం పరకాల పట్టణ ఆర్టీసీ బస్టాండ్ లో నాలుగు నూతన ఆర్టీసీ బస్సులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి(MLA Revuri Prakash Reddy) జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వయానా బస్సు నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి సారిగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్నదని, 2023 డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి రాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అందిస్తున్నారని, త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయబోతున్నారని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల టికెట్లపై ఉచిత బస్ ప్రయాణాల ద్వారా ఆర్టీసీ కి 6వేల కోట్లు లాభం వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళల ను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఆర్టీసీ బస్సులు, సోలార్‌ ప్లాంట్లు, క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, డెయిరీ యూనిట్‌, ఇతర స్వయం ఉపాధి పథకాలతో ఆర్థికంగా భరోసా అందిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళాశక్తి పథకంతో మహిళా సంఘాలు బస్సులు కొనుగోలు ద్వారా ఆర్థికంగా ప్రగతి సాధిస్తుందని అన్నారు. ఉచిత బస్ ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.