మూతపడ్డ మహిళా శక్తి క్యాంటీన్
కేసముద్రం, మార్చి 18 (విజయక్రాంతి): కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో 2024 డిసెంబర్ లో ప్రారంభించిన మహిళా శక్తి క్యాంటీన్ మూతపడ్డప్పటికీ తిరిగి ప్రారంభించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జనసమ్మర్థం అధికంగా ఉండే చోట ఆసక్తి కలిగిన మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయ తలపెట్టింది.
ఇందులో భాగంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మహిళా సంఘం ఆధ్వర్యంలో అప్పటి మండల మహిళ సమాఖ్య అధికారులు మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయించారు. క్యాంటీన్ ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ఉచితంగా భవనం ఇవ్వడంతో పాటు, ఇతర మౌలిక వసతులను కల్పించగా, క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన మహిళా సంఘానికి మూడున్నర లక్షల రూపాయలను రుణంగా ఇప్పించారు.
ఏర్పాటుచేసిన మహిళా శక్తి క్యాంటీన్ ను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. అయితే మొదట్లో కాస్త ఆశాజనకంగానే నడిచినప్పటికీ, తర్వాత పెద్దగా గిరాకీ లేదని, క్యాంటీన్ నిర్వహణ భారంగా మారిందంటూ మహిళలు క్యాంటీన్ మూసివేశారు. మార్కెట్ అన్ సీజన్ కావడం, వ్యవసాయ ఉత్పత్తులు విక్రయానికి రైతులు తేక పోవడం, క్యాంటీన్ పక్కనే ఐదు రూపాయలకు సద్ది మూట భోజనం ఉండడం వల్ల క్యాంటీన్ కు రైతులు రావడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో,
నిర్వహణ కష్టంగా మారిందని మహిళా సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ, క్యాంటీన్ ఏర్పాటు కోసం తీసిన అప్పుకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి ఎదురవుతోందని క్యాంటీన్ నిర్వహణ నుండి పూర్తిగా వైదొలిగారు. ఆ తర్వాత క్యాంటీన్ తిరిగి తెరవడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో మహిళ సమాఖ్య అధికారులు కూడా చేతులెత్తేశారు. దీనితో కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ విఫలయత్నంగా మారింది.




