మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
భిక్కనూర్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడినట్లు బుధవారం బీజేపీ నాయకులు తెలిపారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి త్వరలోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడుతూ రైతులు తమ మొక్కజొన్న పంటను దళారులకు తక్కువ ధరలకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతుల తరఫున స్పందించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి రైతులు, బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, భిక్కనూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్, జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి గంగారెడ్డి, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు వలకొండ రవీందర్ రెడ్డి, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ జిల్లెల్ల లింగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి తిరుమలేష్, పొన్నాల రంజిత్ కుమార్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






