calender_icon.png 12 December, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలీనం వెనుక మజ్లిస్ మాయ!

12-12-2025 12:00:00 AM

  1. హడావుడి నిర్ణయం వెనుక ఆంతర్యమేంటి?

కమిషనర్‌ను నిలదీసిన బీజేపీ అగ్రనేతలు

17లోపు కమిటీల ద్వారా పూర్తి నివేదిక ఇస్తామని ప్రకటన

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విస్తరణ, వార్డుల పునర్విభజన వ్యవహారంపై బీజేపీ యుద్ధం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రజా ప్రయోజనం లేదని, తమ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే భారీ ప్రహసనానికి తెరలేపారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వార్డుల డీలిమిటేషన్‌పై అభ్యంతరాల స్వీకరణ రెండో రోజైన గురువారం బీజేపీ సీనియర్ నేత, ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బండా కార్తిక, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లింది. కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కలిసి తమ సందేహాలు, అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చించి, వినతిపత్రం అందజేసింది.

అనంతరం మర్రి శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంతటి కీలకమైన, భారీ నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ  ఎందుకు జరపలేదని నిలదీశారు. మజ్లిస్ కు న్యాయం చేసేందుకే, వారి సీట్లు పెంచేందుకే ఈ తంతు నడిపారని ఆరోపించారు. వార్డుల సరిహద్దులు తెలిపే మ్యాపులు అందుబాటులో లేకుండా అభ్యంతరాలు ఎలా చెపు తారని ప్రశ్నించారు. పాత 150 వార్డుల్లో జనా భా ఎంత? ఓటర్లు ఎంతమంది? కొత్తగా ఏర్పడే వార్డుల్లో పరిస్థితి ఏమిటి అనే డేటాను వెంటనే బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మజ్లిస్ గెలుపు కోసమే ప్రభు త్వం కుమ్మక్కు కొత్త వార్డులను సృష్టించింది అని ఆరోపించారు. విలీనం పేరుతో ప్రజలపై పన్నుల భారం  ఎలా మోపుతారో చెప్పాలని నిలదీశారు. వార్డుల విభజనపై తాము పార్టీ తరఫున ప్రత్యేక కమిటీలు వేసుకున్నామని, క్షేత్రస్థాయిలో పరిశీలించి 17వ తేదీ లోపు కమిషనర్‌కు నివేదికను అందజేస్తాం అని స్పష్టం చేశారు. ప్రభుత్వం, ఏకపక్షంగా విలీన నిర్ణయం తీసుకుందని మాజీ మంత్రి కృష్ణ యాదవ్ అన్నారు.