calender_icon.png 10 December, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనరల్ స్థానాల్లో బరిలో ఉన్న బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించండి

09-12-2025 01:59:19 PM

హనుమకొండ,(విజయక్రాంతి): బీసీలను మోసం చేసిన రాజకీయ పార్టీలకు  బుద్ధి చెప్పాలంటే ప్రస్తుతం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించి, బీసీల రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలని బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం హన్మకొండ ప్రెస్ క్లబ్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 15,16 వ తేదీలలో చేపట్టబోయే పార్లమెంట్ ముట్టడి వాల్ పోస్టర్ ను బీసీ జేఏసీ కమిటీ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు.

అనంతరం వడ్లకొండ వేణు గోపాల్ గౌడ్ మాట్లాడుతూ చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇవ్వలేమని, పార్టీపరంగా 60 శాతం ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ మొన్న గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో గానీ, మక్తల్, కొత్తగూడెం, హుస్నాబాద్ లలో జరిగిన బహిరంగ సభలో గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు ఆ మాటే మాట్లాడడం లేదని, బీసీలను మోసగించడానికి 60 శాతం అంటూ డ్రామాలాడుతున్నారనిమండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంలో 42% బీసీ రిజర్వేషన్ల గురించి ప్రధానితో చర్చించకపోవడం బీసీలను నయవంచనకు గురిచేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు.

కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నీ కలిసిన సందర్భంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంటు స్తంభింపజేసి, కేంద్రం పై ఒత్తిడి పెంచాలని, పార్లమెంట్ నడుస్తున్నందున పార్లమెంట్లో కార్యాచరణ పై ఎందుకు చర్చించలేదో బీసీ సమాజానికి సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అడగాల్సిన కాంగ్రెస్ అడగడం లేదని, చేయాల్సిన బిజెపి బీసీ రిజర్వేషన్ల బిల్లు ను తొక్కిపెడుతుందని, బీసీలను నమ్మించి మోసం చేయడంలో బిజెపి,కాంగ్రెస్ దొందు దొందేనని, వారి అబద్ధాలకు ఎన్ని అవార్డులు ఇచ్చిన సరిపోవని ఎద్దేవా  చేశారు.42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు 5380 సర్పంచ్ స్థానాలు దక్కేవని, బీసీ రిజర్వేషన్లను 17 శాతం కు తగ్గించడం వలన కేవలం 2300 సర్పంచ్ సీట్లు బీసీలకు వచ్చినవనీ,

ఇలా బీసీలను మోసం చేశారని, రాజకీయ పార్టీలు బీసీలకు చేసిన మోసానికి బుద్ధి చెప్పాలంటే రాష్ట్రంలోని జనరల్ స్థానాలలో నిలబడిన బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించి సర్పంచ్ ఎన్నికలలో బీసీల సత్తాను చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని ఈనెల 15వ, తేదీన ఢిల్లీలో పార్లమెంటును ముట్టడించడానికి జిల్లా నుండి పార్టీలకతీతంగా వేలాదిమంది ఢిల్లీకి తరలి రావాలని,16వ తేదీన ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు దొడ్డిపల్లి రఘుపతి, డా. చిర్రా రాజు గౌడ్, బోనగాని యాదగరి గౌడ్, తమ్మేల శోభరాణి, తెల్ల సుగుణ, కిషోర్, భీమగాని యాదగిరి, బక్కి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.