calender_icon.png 25 August, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న, ఎల్లమ్మల సాక్షిగా భక్తుల నిలువు దోపిడీ

25-08-2025 12:00:00 AM

  1. కొమురవెళ్లిలో అధిక ధరలు 
  2. ప్రతి సేవకు పైకమే పేరుకే నిత్యాన్నదాన సత్రం
  3. రాను.. గా జాతర నేను.. అంటున్న భక్తులు 

కొమురవెల్లి, ఆగస్టు 23: రానుగా జాతర నేను.. రాను, నేనాగం గాను... అంటున్నారు కొమురెల్లి మల్లన్న భక్తులు. ఆధ్యాత్మిక చింతనతోపాటు మానసిక ప్రశాంతత కోసం వెళ్తుంటారు. కానీ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయంలో దోపిడిని చూసిన భక్తులు ఉన్న ప్రశాంతత కోల్పోతున్నారు. ఇదే విధానం కొనసాగితే భక్తుల రాక తగ్గి, ఆదరణ కోల్పోయే ప్రమాదం ఏర్పడనుంది. ఆలయం టెండర్ దుకాణదారులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

టెండర్ నిబంధనలుకు విరుద్ధంగా అందిన కాడికి గుంజుతు న్నారు. ఆలయానికి వచ్చింది మొదలు దర్శనం పూర్తయ్యే వరకు ఏం కొనాలన్నా అడిగినంత ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. వాహన పార్కింగ్ మొదలు పూజా సామాగ్రి కొనుగోలు వరకు టెండర్ దారు లు భక్తుల జేబులు కొల్లగొడుతున్నారు. ఇది ఏంటి అని ప్రశ్నిస్తే’, “ఇక్కడ ఇంతే కొంటె కొను లేకపోతే దిక్కున్న చోట చెప్పుకోమం టు” చిందులు వేస్తున్నారు.

దేవాదాయ శాఖ వారు తమ రాబడిని చూస్తున్నారే తప్ప భక్తుల అవస్థలను పట్టించు కోకపోవడం గమనారం. మల్లన్న ఆలయం మాత్రం పక్కా కమర్షియల్ అంటున్నారు భక్తులు. గత ఆర్థిక సంవత్సరం కంటే సారి రూ.2.23 కోట్లు అధికంగా ఆదాయం వచ్చిందని గొప్పగా చెప్పుకోవడం తప్ప భక్తుల బాగోగుల గురించి పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ప్రతి సేవకు పైకమే...

సేవ ఉచితమనే పదాలకు ఈ ఆలయంలో చోటే లేదని చెప్పాలి.   ఇక్కడి  భక్తులకు మాత్రం ఎలాంటి ఉచిత సేవలు దొరకవు. ప్రతి సేవకు ధర నిర్ణయించి భక్తుల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. రాష్ర్టంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఏదో ఒక రూపంలో ఉచిత సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక్కడ మచ్చుకైనా కానరావు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి సేవకు పైకమే.  పేరుకే నిత్య అన్న దాన సత్రం. జాతర సమయంలో, ఆదివారం అన్నమే దొరకదు.

వసతి గృహాల సంగతి చెప్పనక్కరలేదు. జాతర సమయంలో ఈ ఆలయం వసతి గృహాలను ప్రభుత్వ శాఖల వారీగా కేటాయించుకుంటారన్న విమర్శలు లేకపోలేదు. సామాన్య భక్తులకు గురించి ఆలోచించేదే ఉండదు. ప్రతి సేవకు చేయి తడపాల్సిందే. తలనీలాల, వాహన పూజ, పట్నాలకు వంటి వాటికి టికెట్లు కొన్నప్పటికీ, మళ్లీ చెయ్యి తడపాల్సిందేనని భక్తులు ఆరోపిస్తున్నారు. 

కొబ్బరికాయ ధర రూ.60లు..

ఆలయం వద్ద గుత్తేదారు కొబ్బరికాయలను బహిరంగ మార్కెట్, టెండర్ ఒప్పందం ధర కంటే అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. టెండర్ ఒప్పందంలో కొబ్బరి కాయ ధర రూ.30 ఉంటే వ్యాపారి మాత్రం డబుల్ ధరకు విక్రయిస్తున్నారు. ఇటీవల ఓ భక్తుడు కొబ్బరికాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని  ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయగా, సదర్ కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చి అధికారులు జేబులు నింపుకుని చేతులు దులుపుకున్నరన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కూల్ డ్రింక్స్ రూ.13 లక్షలు..

గుట్టపై నున్న ఎల్లమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ తో పాటు పూజా సామాగ్రి అమ్ముకోవడానికి టెండర్దారులు రూ.13 లక్షలకు టెండర్ దక్కించుకున్నారంటే దోపిడీ ఏ రేంజ్ లో ఉంటదో అర్థం చేసుకోవచ్చు. ఈ దుకాణానికి వేలంలో సరైన ధర రాలేదని 4 సార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాంబూలాలిచ్చాము తన్నుక  సావండి అనే విధంగా ఉంది దేవాదాయ శాఖ అధికారుల తీరు. మీరు ఎంతకైనా అమ్ముకోండి, మాకు మాత్రం మామూళ్లు ఇవ్వండి అనేది అధికారుల లక్ష్యం అయితే వ్యాపారులు మాత్రం ప్రతిదీ ఉన్నధర కన్న రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. 

పార్కింగ్ ఫీజు అధికంగా వసూల్ ..

సందిట్లో సడేమియా అన్నట్లుగా గ్రామపంచాయతీ వారు కూడా వాహన పార్కింగ్ కు టెండర్ పెట్టి భక్తుల నుండి  ఇష్టాను రీతిగా  డబ్బులను వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. పార్కింగ్ ప్లేస్లే కాకుండా, రోడ్డుపై పార్కింగ్ చేసిన వాటిపై కూడా  ఫీజు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

సందు దొరికితే చాలు..

ఆలయ వర్గాలు ఆదాయ మార్గాల కోసం కొత్త దారులను అన్వేషిస్తుంది. ఆదాయం వచ్చే మార్గాలు పెంచుకోవడంలో  భాగంగా చెప్పులు స్టాండ్, సెల్ ఫోన్ భద్రపరచుట, పూజా సామాగ్రి తదితర అంశాలకు సంబంధించి గత 4 ఏండ్ల నుండి టెండర్ నిర్వహించి, భక్తుల నిలువు దోపిడి చేస్తున్నారు. గతంలో వీటికి ఎలాంటి రుసుము వసూలు చేసేవారు కాదు.

చిరు వ్యాపారుల ఉపాధికి దెబ్బ..

చుట్టుపక్కల మూడు నాలుగు గ్రామాల ప్రజలు మల్లన్న ఆలయం, ఎల్లమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్, చెప్పుల స్టాండ్, వాటర్ బాటిళ్లు, పూజ సామాగ్రి, పూలదండలు అమ్ముకొని  పోట్టబోసుకొనేవారు. అధికారులు పనితీరుకు ఉపాధి కోల్పోతున్నారు. సంవత్సరానికి ఒక్కో విభాగానికి  టెండర్ పెడుతూ, వీళ్లలో వీళ్ళు ఐక్యం కాకుండా జాగ్రత్తపడ్డారు. వీరికి ఉపాధి దూరం చేయాలనే కుట్రతో టెండర్ ప్రక్రియ మొదలుపెట్టారు.

గత పాలకవర్గంతో పాటు, ప్రస్తుత పాలకవర్గం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారు. ఆలయం వద్ద ఊరివారిని పరాయి వారిగా చూసే పరిస్థితి వచ్చిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారులు ఎమ్మార్పీ కంటే రూపాయొ, రెండు రూపాయలో ఎక్కువగా తీసుకొని  అమ్మేవారు. కానీ టెండర్ దారులు తమ ఇష్టం ఉన్న ధరకు అమ్మి భక్తులను దోపిడి చేస్తున్నరని స్థానికులు ఆరోపిస్తున్నారు.