calender_icon.png 25 August, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలేని లక్ష్యం..!

25-08-2025 12:00:00 AM

  1. బల్దియాలో జాడ లేని వనమహోత్సవం
  2. సంగారెడ్డి మున్సిపల్ లక్ష్యం 95 వేలు
  3. ఇప్పటివరకు నాటినవి కొన్నే..
  4. 20 శాతం నాటినట్లు నమోదు
  5. మున్సివల్ అధికారుల ఇష్టారాజ్యం

సంగారెడ్డి, ఆగస్టు 24(విజయక్రాంతి) : పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంగారెడ్డి మున్సివల్ పరిధిలో 2025-20 ఏడాదికి గాను 95వేల మొక్క లు నాటాలని లక్ష్యం విధించింది. వానాకాలం ప్రారంభమై మూడు నెలలవుతున్నా పట్టణంలో డంప్ యార్డు, డివైడర్ల మధ్య, స్మశానవాటికల్లో మినహా మరెక్కడా మొక్కలు నాటిన దాఖలాలు లేవు.

పట్టణానికి అవసరమైన మొక్కలు సరఫరా చేసేందుకు సుమారు రూ.30 లక్షల వ్యయంతో టెండర్లు పిలువగా సరఫరా బాధ్యతలు దక్కించుకున్న కొండాపూర్ మండలానికి చెందిన కాంట్రాక్టర్ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మొక్కలను సరఫరా చేయలేదు. ఈ విషయంలో అధికారులు, కాంట్రాక్టర్ మధ్య సయోధ్య కుదిరిందనే ఆరోపణలున్నాయి. ఇప్పటివరకు 20 శాతం మాత్రమే మొక్కలు నాటిన బల్దియా అధికారులు నిమ్మకుండి పోయారు. అదికూడా రికార్డుల్లోనే ఉన్నాయి తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. 

సంగారెడ్డి పట్టణంలో ఈ ఏడాది 95 వేల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని బల్దియా అధికారులను ఆదేశించింది. కార్యక్రమ ప్రారంభంలో డంప్ యార్డు వద్ద బల్దియా అధికారులు కొన్ని మొక్కల వరకు నాటారు. మిగతా డివైడర్ల మధ్య, వైకుంఠపురం వద్ద గల స్మశానవాటిక  వద్ద మరికొన్ని మొక్కలు నాటారు.  దీంతో పట్టణంలో నిర్దేశిత లక్ష్యం చేరుకునే అవకాశం ఎంతమాత్రం పూర్తి కాలేదు. అయితే ఉన్నతాధికారుల మెప్పు కోసం మొక్కలు నాటినట్లు అధికారులు నివేదికలు సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది.  

కాలయాపన చేస్తున్న అధికారులు...

పట్టణంలో వనమహోత్స కార్యక్రమం నిర్వహిస్తే ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించాల్సి ఉంది. ఇప్పటివరకు పట్టణంలోని 38 వార్డుల పరిధిలో ఏ ఒక్కచోట వనమహోత్సవం నిర్వహించిన దాఖలాలు లేవు. పూలు, పండ్ల మొక్కలు ఇంటింటా అందించామని అధికారులు చెబుతుండగా ఏ కాలనీలోనూ ఒక్క మొక్క పంపిణీ చేసిన సందర్భం లేదు. వనమహోత్సవాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

నర్సరీ వద్దు.. కొనుగోలే ముద్దు..

పట్టణంలో లక్ష్యానికి అనుగుణంగా అవసరమైన మొక్కలు మున్సిపల్ అధికారులు నర్సరీల్లో పెంచాల్సి ఉంది. అయితే నర్సరీల నిర్వహణ గిట్టుబాటు కావడం లేదనే ఉద్దేశంతో రెండేళ్లుగా కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. ఒక్కో మొక్కను రూ.100 నుంచి రూ.200 వరకు కొనుగోలు చేస్తున్నారు. అవసరమైన మొక్కలు తెప్పించేందుకు రూ.30 లక్షలతో టెండర్లు ఆహ్వానించారు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలానికి చెందిన ఓ నర్సరీ వారు టెండర్లు దాఖలు చేశారు. సదరు కాంట్రాక్టర్ ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వానాకాలం సీజన్ అయిపోతున్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని బల్దియా అధికారులు పూర్తి చేయకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.  

లక్ష్యం మేరకు నాటుతాం..

పట్టణంలో వనమహోత్సవంలో భాగంగా ఈ యేడాదికి గాను 95 వేల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో 20 శాతం మొక్కలు నాటాం. ఇందుకు అవసరమైన మొక్కలను కొండాపూర్‌కు చెందిన కాంట్రాక్టర్ ద్వారా తెప్పిస్తున్నాం. పూ లు, పండ్ల మొక్కలు రావాల్సి ఉంది. సోమవారం నుండి వార్డులలో మొక్కలు నాటనున్నాం. మొక్కలు అందిన వెంటనే ఇంటింటా సరఫరా చేస్తాం.

 శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్, సంగారెడ్డి