17-01-2026 04:20:54 PM
- మునిసిపల్ లో విలీనం చేస్తే హక్కులు కోల్పోతాం
- సమస్యలు పరిష్కరించే దాకా పోరాడుతాం
- ప్రభుత్వం సహకరించకపోతే ఓటుతో నిరసన వ్యక్తం చేస్తాం
- విలేకరుల సమావేశంలో మల్లన్న సాగర్ పునరావాస గ్రామాల ప్రజలు
గజ్వేల్: మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ లో విలీనం చేయొద్దని గ్రామపంచాయతీలు గానే కొనసాగించాలని మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కోరారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలను చేర్చడం వల్ల గ్రామాలన్ని పునరావాస హక్కులను కోల్పోతామన్నారు.
గత ప్రభుత్వం 2019 ఎన్నికలలో గ్రామాలను ఖాళీ చేసి అన్యాయం చేస్తే, ఇప్పుడు మున్సిపాలిటీలో చేర్చి మరోసారి పునరావాస గ్రామాలు అన్యాయానికి గురవుతాయన్నారు. పునరావాస చట్టం ప్రకారం ఆయా గ్రామాలకు రావలసిన బడి, గుడి, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు గ్రామపంచాయతీలు గానే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ కార్యకర్తలమని, అలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఊరుకోమని, కానీ ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేసే విధంగా కార్యక్రమాలు చేయమన్నారు. ప్రజలను రెచ్చ గొట్టి రాజకీయాలు చేసేది రాజకీయ పార్టీలు మాత్రమే కానీ తమలాంటి నిస్వార్థులు కారన్నారు.
వాస్తవాలు నిర్వాసితులకు తెలియాలని, ప్రత్యేకంగ యువత మేల్కొనడానికి, హక్కుల సాధన కొరకు పోరాడుతున్నమన్నారు. మున్సిపల్ లో కలపడం వలన ఉపాధి పొందే వారు కేవలం కౌన్సిలర్ మాత్రమే కానీ కొన్ని వేల మందికి ఉపాధి హామీ కార్డ్ లేకుండా పోతుందని, ఇంటిపన్నుతో మొదలయ్యే పన్నుల పోటు ఎలాంటి ఉపాధి లేని కుటుంబాలకు గుదిబండగా మారకుండా చూడాలని కోరుతున్నామన్నారు. పునరావాస గ్రామాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమం లో మల్లన్న సాగర్ బాధితులు అయితోద్దిన్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, ఉమా రెడ్డి, చిర్ల శ్రీనివాస్, పవన్ కుమార్ రెడ్డి, పుష్ప రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.