17-01-2026 04:24:28 PM
బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలి
చివ్వెంల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం చందుపట్ల గ్రామంలోని ఐకెపి సెంటర్ (సన్న వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం)లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు మండల ఏపీఎం వెంకయ్యకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఐకేపీ సెంటర్ ద్వారా సుమారు 20 నుంచి 30 లారీల వడ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
అయితే, కొన్ని లారీలలో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్కో లారీ నుంచి 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు వడ్లను అక్రమంగా కట్ చేయడం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన అనంతరం వెలుగులోకి రావడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు.ఈ అక్రమాలపై ఐకెపి నిర్వాహకులను ప్రశ్నించగా, “మీ వడ్లలో బియ్యం తక్కువ వచ్చింది” అంటూ ఆధారాల్లేని సమాధానాలు చెబుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది రైతుల శ్రమను దోచుకునే చర్యగా వారు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య,చైతన్య యువజన మండల అధ్యక్షులు బాషిపంగు సునీల్,రైతులు సురేష్, వెంకటేష్, వంశి తదితరులు పాల్గొన్నారు.