31 March, 2026 | 1:10 AM

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం

06-05-2024 12:05 AM

నిరుద్యోగులను నమ్మించి రూ. 46లక్షలతో పరార్

నిందితుడు మహేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (విజయక్రాంతి): ఉన్నత చదువులు చదు వుకొని, సరైన ఉద్యోగాలు రాక, కుటుంబ సభ్యులకు మోహం చూపించలేక ఎంతోమంది నిరుద్యోగులు సర్టీఫికెట్స్ చేత పట్టుకుని కంపెనీల చుట్టూ తిరుగుతుంటా రు. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు నిరుద్యోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నా రు. ఉద్యోగం వస్తుందేమోననే ఆశతో, అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించి, తీరా ఉద్యోగాలు రాక మోసపోయామని గ్రహించిన కొందరు పోలీసుల ను ఆశ్రయిస్తుంటే.. మరికొందరు నా కర్మ ఇంతేలే అనుకుంటూ లోలోపలే కుమిలిపోతున్నారు.

ఈ క్రమంలో తాజాగా బెంగుళూరుకు చెందిన మహేష్ అనే వ్యక్తి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, హైదరాబాద్‌కు చెందిన పలువురి నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశాడు. యూసుఫ్‌గూడకు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు, నిందితుడు మహేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుడితో పాటు అతని స్నేహితుల నుంచి రూ. 46.19లక్షలు కాజేసి అక్కడి నుంచి పరార్ అయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మహేష్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే మహేష్‌పై 16కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.