calender_icon.png 29 September, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింలపై చిన్నచూపా!

29-09-2025 01:47:52 AM

కాంగ్రెస్ పార్టీ తమకు సముచిత గౌరవం కల్పించడం లేదని, పార్టీ చేతిలో మోసపోయామనే భావనలో కొందరు ముస్లిం నేతలు ఉన్నట్లు తెలిసింది. కొడంగల్‌లో అర్ధరాత్రి మసీదులు కూల్చివేతకు గురికావడం, మదరసాలపై దాడులు, మతపరమైన అలజడుల పరిణామాలు పార్టీపై అపనమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. మైనారిటీ సంక్షేమ బడ్జెట్‌ను పెంచుతామని హామీ ఇచ్చి కూడా అమలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2023 రాష్ట్ర బడ్జెట్‌లో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీవర్గాలకు ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ మరింత పెంచాల్సి ఉండగా, ఆ కేటాయింపులను తర్వాతి బడ్జెట్‌లో రూ.1,600 కోట్లకు కుదించడం విమర్శలకు తావిచ్చింది. 

2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీపై తాము పెట్టుకున్న అంచనాలు అందుకోలేదని తెలంగాణ ముస్లిం మైనార్టీవర్గంలో అసంతృప్తి కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం సమాజం ఒక నిర్ణయాత్మక శక్తిగా నిలిచింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 40 స్థానాల్లో 20 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు ముస్లింలే ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని కనీసం 15 నియోజకవర్గాలపై వారి ప్రభా వం ఉంది.

నాంపల్లి. బహదూర్‌పురా, కార్వాన్, చంద్రాయణగుట్ట, మలక్‌పేట, చార్మినార్, జూబ్లీహిల్స్ వంటి నియోజకవర్గాల్లోనైతే ముస్లింలు ఎవరికి ఓటు వేస్తే వారే విజేత అన్న పరిస్థితి ఉంది. అలా వారు ఆయా నియోజకవర్గాల్లో గేమ్-చేంజర్స్‌గా నిలిచారు. రాష్ట్రంలో ముస్లిం జనాభా 45 లక్షలు. మొత్తం జనాభాలో వీరు 12 శాతం. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మైనారిటీ డిక్లరేషన్, మైనారిటీ సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు, వక్ఫ్ భూముల సంరక్షణ, మసీదులు, మదర్సాల అభివృద్ధి, మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యకు ఉపకార వేతన పథకం ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది.

రాజకీయపరంగా ముస్లింల ప్రాతినిధ్యం పెంచడం అన్నిటికంటే పెద్ద హామీ. హామీలన్నింటి అమలు కోసం ముస్లిం మైనార్టీ ఎదురుచూస్తున్నది. ముస్లింలను దశాబ్దాలుగా ఆల్ ఇండియా మజ్లిస్-- ఎ--ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం), కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి.

2023 అసెం బ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ వెలుపల ఉన్న ముస్లింలు కాంగ్రెస్‌కు నిర్ణయాత్మక మద్ద తు ఇచ్చి, పార్టీ విజాయానికి దోహదపడ్డారు. మొత్తం 119 సీట్లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 65 సీట్లను గెలుచుకున్నది. బీఆర్‌ఎస్ కేవలం 39 సీట్లకు పరిమితమైంది. బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకున్నది. ఎంఐఎం పార్టీ దాని సంప్రదాయ ఏడు స్థానాలను యథావిధిగా దక్కించుకున్నది. 

నిర్ణయాత్మక శక్తిగా..

ముస్లింల మద్దతు లేకపోతే కాంగ్రెస్ 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటలేదనేది గత అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిందన్నది వాస్త వం. ఓటింగ్‌శాతం పరంగా చూస్తే కాంగ్రె స్, బీఆర్‌ఎస్ మధ్య వ్యత్యాసం కేవలం 1.8 శాతం మాత్రమే. కాంగ్రెస్‌కు ముస్లిం లు తిరుగులేని మద్దతు ఇచ్చి కింగ్          మేకర్స్‌గా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల నాయకత్వాన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

అరకొర కేటాయింపులు..

కాంగ్రెస్ పార్టీ తమకు సముచిత గౌరవం కల్పించడం లేదని, పార్టీ చేతిలో మోసపోయామనే భావనలో కొందరు ముస్లిం నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. కొడంగల్‌లో అర్ధరాత్రి మసీదులు కూల్చివేతకు గురికావడం, మదరసాలపై దాడులు, మతపరమైన అలజడుల పరిణామాలు పార్టీపై అపనమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. మైనారిటీ సంక్షేమ బడ్జెట్‌ను పెం చుతామని హామీ ఇచ్చి కూడా అమలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2023 రాష్ట్ర బడ్జెట్‌లో నాటి బీఆర్ ఎస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి రూ. 2,200 కోట్లు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీవర్గాలకు ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ మరింత పెంచాల్సి ఉండగా, ఆ కేటాయింపులను తర్వాతి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,600 కోట్లకు కుదించడం విమర్శలకు తావిచ్చింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 27 శాతం కేటాయింపులు తగ్గించినట్లయింది.

కేటాయించిన ఆ కేటాయింపులను సైతం ప్రభుత్వం అభివృద్ధి పనులకు వెచ్చించకపోవడంపైనా మైనార్టీ వర్గం నుంచి విమర్శలువ వెల్లువెత్తుతున్నా యి. బోరబండ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో శ్మశానవాటికకు స్థలాల సేకరణ విషయం లో ముస్లింలను ఇబ్బంది పెట్టడం, మసీద్ కమిటీ సభ్యులపై అక్రమ కేసుల బనాయించడంతో ఆ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిం ది.

అలాగే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల మూసివేయడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు విడుదల చేయకపోవడం, షాదీముబారక్ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో మైనార్టీ వర్గాల్లో అసంతృప్తి కనిపిస్తు న్నది. పార్టీ తమకు సముచిత గౌరవం ఇస్తుందని, సాధికారతకు బాటలు వేస్తుందని ఆశిస్తే, తమకు భంగపాటు జరిగిందని మైనార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల విశ్వాసాన్ని కోల్పోవడం కేవలం పరిపాలనపరమైన వైఫల్యమే కాకుండా, సైద్ధాంతిక మద్దతును కోల్పోతున్నట్లు భావించాలి.

మొదటి నుంచి లౌకిక త్వాన్ని సమర్థిస్తున్న కాంగ్రెస్‌కు తాజాగా పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపే అవ కాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఒక బలమైన ఓటుబ్యాంక్ అయిన ముస్లిం మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయింపులే తక్కువంటే, మళ్లీ ఆ కేటాయించిన నిధులను కూ డా వినియోగించకపోవడంపై ముస్లింలు పె దవి విరుస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేనప్పుడు లేనిపోని వాగ్దానాలు ఎందుకివ్వాలని ప్రశ్నలను ప్రభుత్వానికి సంధి స్తున్నారు.

నాయకత్వంపై అణచివేత ధోరణి..

లౌకికత్వాన్ని సమర్థించే కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడటం బాధాకరం. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల రూపశిల్పి మహ్మద్ షబ్బీర్ అలీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి స్థానాన్ని త్యా గం చేశారు. ఆయన త్యాగం లేకుండా, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. ఎన్నికల తర్వాత అయినా పార్టీ షబ్బీర్ అలీకి కనీసం ఎమ్మెల్సీ పదవైనా ఇవ్వంలేదు. మం త్రి పదవినీ నిరాకరించారు. చివరకు ఎలాం టి ప్రాధాన్యం లేని ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.

దీంతో షబ్బీర్‌అలీ త్యాగానికి ప్రతిఫలం అవమానమే అన్న జవాబు  పార్టీ నుంచి వచ్చిన ట్లయింది. అలాగే సియాసత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఉర్దూ తెలిసిన ఓటర్లను కాంగ్రెస్ గెలుపు కోసం సమీకరించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీని పార్టీ ముం దు ఆయనకే కట్టబెట్టాలని చూసింది. ఈ మేరకు ఆయన ప్రొఫెసర్ కోదండరామ్‌తో కలిసి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆయన్ను సస్పెండ్ చేసింది. చివరకు అమీర్ అలీఖాన్ రాజకీయపరమైన పావుగా మారారు. 

త్యాగాలకు విలువేది?

జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో పోటీకి దిగ్గజ క్రికెటర్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ అన్నిరకాలుగా అర్హుడు. ఈ నియోజకవర్గం లో ముస్లింల జనాభా 35 శాతం వరకు ఉం ది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. నైతికంగా చూస్తే త్వరలో జరిగే ఉప ఎన్నికలో పార్టీ అజారుద్దీన్‌ను బరిలోకి దింపడమే సబబు.

ఏ ప్రత్యర్థి ముస్లిం నా యకుడు ఎదగకూడదని కోరుకునే ఎంఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశం మేరకే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌కు ఎమ్మె ల్సీ కట్టబెట్టి ఆయన నోరుమెదపకుండా చేసిందనే వి మర్శలు ఉన్నాయి. షబ్బీర్‌అలీ, అమీర్‌అలీ ఖాన్, అజారు ద్దీన్ చేసిన త్యాగాలను పార్టీ గుర్తించకపోవడం, ప్రతిఫలం అం దివ్వకపోవడం ద్రోహమనే భావన ముస్లిం వర్గాల్లో ఉంది.

ఎంఐఎంను సంతృప్తి పరిచేందుకే కాంగ్రెస్ పార్టీ ఆ ముగ్గురినీ ఉద్దేశపూ ర్వకంగా రాజకీయ బలిపీఠం ఎక్కించినట్టు విమర్శలు వెల్లువెత్త తున్నాయి. ఇలాంటి వైఖరి మైనారిటీ వర్గాల గొంతు నొక్కడం, రాజకీయపరంగా వారిని అణచివేవడం కాంగ్రెస్ పార్టీ బలహీనపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయప డుతున్నారు. 

రాష్ట్రంలో ముస్లిం నాయకత్వాన్ని అణచివేయాలని చూస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ అజెండాను అమలు చేసేం దుకు సిద్ధమైందనే అ పప్రద మూటగట్టుకుంటున్నది. నార్టీవర్గాలను బీజేపీ 

అణగదొక్కుతున్నదని బీజేపీపై దేశవ్యాప్తంగా విమ ర్శలు వెల్లువెత్తుతున్న వేళ కాంగ్రెస్ ప్రభు త్వం కూడా అదే తరహా ధోరణి అవలంబించడం ముస్లింవర్గాల్లో చర్చకు దారి తీసింది. షబ్బీర్‌అలీని అవమానించడం, అమీర్ అలీ ఖాన్‌ను ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకపోవడం, అజారుద్దీన్‌కు సర్ది చెప్పడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం నాయకత్వాన్ని రాజకీయంగా బలహీనపరిచారనే, తద్వారా ముస్లింల తరఫున బలమైన గొం తు లేకుండా చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నామినేటెడ్ పోస్టుల్లోనూ అన్యాయం..

నామినేటెడ్‌తో పాటు ఇతర ప్రభుత్వ పదవుల కేటాయింపుల్లోనూ తమకు అన్యా యం జరిగిందని ముస్లింలు భావిస్తున్నారు. లౌకిక, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు మద్దతుగా నిలిచిన ముస్లింలు ఇప్పుడు తమ అస్తి త్వానికే ప్రమాదం వచ్చిందనే అభిప్రాయంలో ఉన్నారు. పాలక పార్టీ అవలంబి స్తున్న ముస్లిం వ్యతిరేక విధానాలు ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా మారే పరిస్థితులు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎలా ఆడిస్తే, కాంగ్రెస్ పార్టీ అలా ఆడుతున్నదని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారని సమాచారం. ఇక్కడ ఎంఐఎం అజెండా స్పష్టంగా కనిపిస్తున్నది. ఏదైనా ముస్లిం నాయకత్వం ఎదుగుతుందంటే దానిని మొగ్గలోనే తుంచే విధంగా పావులు కదుపుతున్నదనేది స్పష్టమవుతున్నది. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి, పార్టీ కోసం త్యాగా లు చేసిన వారికి సముచిత గౌరవం పదవులు కట్టబెట్టకుండా, తిరిగి కాంగ్రెస్ మొం డిచేయి చూపడం దేనికి సంకేతం? 35శాతం జనాభా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ముస్లిం నేతను బరిలోకి దింపేందుకు పార్టీ ఎందుకు నిరాకరిస్తుంది? బలమైన ముస్లిం నేత షబ్బీర్ అలీ ఎందుకు అవమానాలు ఎందుకు ఎదుర్కొంటారు? అమీర్ అలీ ఖాన్ రాజకీయాల్లో బలిపశువవుతా రు? వీటన్నింటిని గమనిస్తే.. కాంగ్రెస్ పార్టీ అవలంబించేది లౌకికవాదం కాదు. ముస్లిం రాజకీయాలను ఎంఐఎం గుత్తాధిపత్యంలో బంధించి ఉంచే కుట్ర అని అవగతమవుతుంది.

సైద్ధాంతిక నైతికత కంటే రాజకీయ ప్రయోజనాలకే పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తున్నది. హైదరాబాద్‌లో ఎంఐఎంతో అంటకాగుతూ స్వల్పకాలిక ప్రయోజనాలు పొందవచ్చు కానీ, దీర్ఘకాలికంగా అది పార్టీకి నష్టం చేస్తుందని కాంగ్రెస్ గుర్తించడం లేదు. ఎంఐఎంకు అనకూలమైన విధానాలు అవలంబిస్తూ తాత్కాలిక ప్రయోజనం పొందు తూ, అధిష్ఠానం మెప్పు పొందాలని చూస్తూ సీఎం రేవంత్‌రెడ్డి.. మైనార్టీ వర్గాన్ని దూరం చేసుకుంటున్నామని మాత్రం గుర్తించడం లేదని, అది ఆయన వ్యూహాత్మక బలహీనత అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ.. పెద్ద మోసం..

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవిని ముస్లింవర్గానికి దక్కకుండా చేసి, కాంగ్రెస్ ఆ వర్గం నోరు మూయించింది. రాజ్యాంగపరంగానే కాక మైనార్టీ ప్రాతినిధ్యాన్నీ గౌరవించలేకపోవడం ముస్లింల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తుంది. అర్హత ఉన్న నాయకులకు పదవి కట్టబెట్టకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంపై విమర్శలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా మైనార్టీ నాయకత్వాన్ని పక్కన పెట్టారనే వాదనలు ఉన్నాయి.

2023 జూలై 31న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆయన మంత్రివర్గం డాక్టర్ శ్రావణ్ దాసోజు, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేశారు. ఇదే ఏడాది సెప్టెంబర్ 19న నాటి గవర్నర్  సిఫార్సులు చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి.. నిరాధారమైన కారణాలను చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ గెలిచిన తర్వాత డాక్టర్ దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో రిట్స్ దాఖలు చేశారు.

పిటిషన్ల సంగతి తేలేంతవరకు ఎమ్మెల్సీ పదవుల అంశం పక్కన పడినట్లయింది. కానీ, గతేడాది జనవరి 27న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసింది. రాత్రికి రాత్రే గెజిట్ జారీ చేసింది. హైకోర్టు ఇదే ఏడాది మార్చి 7న గవర్నర్ తిరస్కరణ, గెజిట్ రెండింటినీ రద్దు చేసింది. జూలై తీర్మానాన్నే మళ్లీ పునరుద్ధరించింది. ఆగస్టు 4న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఆగస్టు 16న కాంగ్రెస్ మళ్లీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌కు సంబంధించిన గెజిట్ ఆధారంగా, చట్టవిరుద్ధంగా వారితో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించింది. ఈ ఏడాది ఆగస్టు 13న సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ పదవులను రద్దు చేస్తూ, మోసాన్నంతా బయటపెట్టింది. సుప్రీంకోర్టు తుది నిర్ణయం వచ్చే వరకు, ఇక ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. అజారుద్దీన్ ఎమ్మెల్సీ కోటా అంశం సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్‌లోనే ఉంది.

మరోవైపు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్, విజయశాంతి, నెల్లికంటి సత్యం, శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్.. మైనార్టీ నాయకత్వానికి పదవులు కట్టబెట్టడంలో మాత్రం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఏదిఏమైనప్పటికీ ముస్లిం నేతల పదవుల అంశం న్యాయస్థానాల పరిధిలో ఉండిపోయి, వారు ఉండి రాజకీయ అనిశ్చితిలో చిక్కుకున్నారనేది వాస్తవం. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే ఇకపై కాంగ్రెస్‌ను ముస్లింలు నమ్ముతారా? ఇప్పటివరకు పార్టీ మైనార్టీలకు చేసిన అన్యాయాన్ని క్షమిస్తారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహమిదే..

కాంగ్రెస్ పార్టీలో ముస్లింల నాయకత్వాన్ని తొలగించడం, కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం, తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుల గురించి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచించకుండా నిరోధించడం, తద్వారా ఇతరులతో పొత్తుపెట్టుకోకుండా ఉండడం, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో స్నేహం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆ క్రెడిట్ తాను తీసుకుంటూ, ఇతర కాంగ్రెస్ నేతలు మిన్నకుండేలా చేసేలా వ్యూహాలను సీఎం రేవంత్‌రెడ్డి అవలంబిస్తున్నారని స్పష్టమవుతున్నది.

మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకత్వాన్ని స్తబ్దుగా ఉండేలా చేసింది. ఈ పరిణామాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపునకు బాటలు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమెకు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం తాలూకు సానుభూతి ఉండగా, కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు.. బీఆర్‌ఎస్‌కు అనుకూలమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.

ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శకం మొదలయ్యే అవకాశం ఉంది. నవంబర్‌లో జరిగే ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. ఎన్నికల ఫలితం బట్టి రాష్ట్రంలో కొత్త పొత్తులు పొడవచ్చు. కొత్త పార్టీలు పుట్టొచ్చు. భవిష్యత్ రాజకీయాలు మరింత కొత్తగా ఉంటాయనేది వాస్తవం.

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి