calender_icon.png 29 September, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూయార్క్‌ను మించి ఫ్యూచర్ సిటీ

29-09-2025 01:38:25 AM

  1. భవిష్యత్ అవసరాల కోసమే ఈ తపన
  2. పదేండ్లు అవకాశమివ్వండి.. అద్భుతంగా తీర్చిదిద్దుతా
  3. ఫ్యూచర్ సిటీలో నాకు భూములున్నాయంటూ తప్పుడు ప్రచారం 
  4. నెలలో మూడురోజులు ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తా
  5. ఎఫ్‌సీడీఏ, గ్రీన్ ఫీల్డ్ రేడియల్
  6. రోడ్డుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

రంగారెడ్డి/కందుకూరు, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు.. ఎన్నాళ్లు న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి చెప్పుకొంటాం.. మనం కూడా అలా తయారు కావాలి కదా. నాకు పదేండ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయం, రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు గ్రీన్ ఫీల్ రేడియల్ రోడ్డు- సీఎం రేవంత్‌రెడ్డి శంకు స్థాపన చేశారు. ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభు త్వం కృషి చేస్తోందని.. అందుకు అందరి సహకారం కావాలని కోరారు. భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని.. కొందరు పనిగట్టుకొని తనకు ఇక్కడ భూములు ఉన్నాయని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

గత ప్రభుత్వంలో మనం కోసం.. భవిష్యత్తు అవసరాల కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైఎస్‌ఆర్ ఇదే ఆలోచన చేయకుంటే ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, హైటెక్ సిటీ వచ్చేది కాదు కదా అని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ మంచి సంకల్పంతో తలపెట్టిన ఈ భార త్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవానికి వరుణదేవుడు కూడా సహకరించాడాని పేర్కొ న్నారు.

విజయదశమి శుభ సూచకమని, అన్ని విజయాలే ఉంటాయని.. ప్రకృతి కూ డా శుభసూచకంగా వర్షం కురిపిస్తోందని చెప్పారు. ‘ఆనాడు కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరానికి అంకురార్పణ చేశారు. నిజాం కాలంలో సికింద్రాబాద్‌ను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్, సిలికాన్ వ్యాలీ అభివృద్ధి జరిగింది. గతం నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మన భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రపంచ నగరాలు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చర్చించుకునేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం’ అని పేర్కొ న్నారు. గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఉం డాల్సిన అర్హతలన్నీ భారత్ ఫ్యూచర్ సిటీకి ఉన్నాయని, దక్షిణ భారతదేశంలో పోర్ట్ లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే కాబట్టి ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీ పట్నం గ్రీన్ ఫీల్ హైవే లో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు.

ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని వివరించారు. ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌం డ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయబోతున్నామని, రాబోయే పదేళ్లలో ప్రపంచంలో ఉం డే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే మా లక్ష్యం అని తెలిపారు. ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని.. ఇందుకు మీ అందరి సహ కారం ఉండాలని కోరారు.

చిన్నచిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందామన్నారు. ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని, నేనే కూర్చుని మీ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ఉచ్చులో పడి కోర్టులకు వెళ్లి నష్టపోవద్దని, తక్షణమే మీ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నట్టు చెప్పారు. అం దరికీ న్యాయం చేయాలనేదే తన తపత్రయమన్నారు. 

నెలకు మూడు రోజులు ఇక్కడే..

నెలకు మూడుసార్లు ఇక్కడికే వచ్చి దగ్గరుండి కార్యకలాపాలను పర్యవేక్షిస్తానని, ప్రపంచంలోని ఏ పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలోనే కూర్చుని మాట్లాడుతానని చెప్పారు. సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఇక్కడ పది ఎకరాలు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు సూ చన చేస్తున్నట్టు చెప్పారు. 2026, డిసెంబర్‌లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.

ఫ్యూచర్‌సిటీకి పునాదిరాయి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీకి పునాదిరాయి పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేటలో ఆదివారం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవన నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2.11 ఎకరాల్లో రూ. 20 కోట్ల బడ్జెట్‌తో భవన నిర్మాణం చేపట్టనున్నారు. దీంతోపాటు సీఎం గ్రీన్ ఫీల్ రోడ్డు ( రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించే రేడియల్ రోడ్డు)కు కూడా శంకుస్థాపన చేశారు.

ఫ్యూచర్‌సిటీ మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 56 రెవెన్యూ గ్రామాలు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై భవిష్యత్తులో ఒత్తిడి తగ్గించి ప్రపంచస్థాయి మౌలిక వసతులను ఫ్యూచర్ సిటీలో కల్పించే లక్ష్యంతో ఈ అద్భుతంగా నగరానికి రాష్ట్రప్రభుత్వం స్వీకారం చేపట్టింది. వరల్ బ్యాంక్, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా)లు అభివృద్ధిలో భాగస్వాములు కానున్నాయి.

రోల్ మోడల్‌గా నిలుపుతాం: డిప్యూటీ సీఎం భట్టి 

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూసేలా, ప్రపంచంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా భారత్ ఫ్యూచర్ సిటిని అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రణాళికాబద్ధమైన నగరం అనగానే అందరికీ చంఢీగఢ్ గుర్తుకొస్తోందని, రాబోయే రోజుల్లో ప్రణాళికాబద్ధమైన నగరమంటే భారత్ ఫ్యూచర్ సిటీ గుర్తుకు రావాలని పేర్కొన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. లివ్-లెర్న్ వర్క్‌ప్లే అనే కాన్సెప్ట్‌తో పరిశ్రమలు, ఆసుపత్రులు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ అన్ని ఒకేచోట ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. భావి తరాల కోసం, మన బిడ్డల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజు మనందరం కలిసి వేస్తున్న పునాదే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అని తెలిపారు.

ఇది ‘నెట్ జీరో కార్బన్ సిటీ’.. ఇక్కడ పచ్చదనం ఉంటుంది, కాలుష్యం ఉండదు. పరిశ్రమలు వస్తాయి, కానీ పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. రేపటి తరాల కోసం.. తెలంగాణ కోసం.. చిత్తశుద్ధితో నిరంతరం కృషి చేస్తున్న ఈ ప్రజాప్రభుత్వంతో కలిసి నడవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ నిర్మల, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ కే శశాంక, కలెక్టర్ సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.