calender_icon.png 29 September, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి దేశానికే ఆదర్శం

29-09-2025 07:39:33 AM

రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి

కల్వకుర్తి: అభివృద్ధిలో దేశంలోని ఆదర్శ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లి నిలుస్తుందని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ(Damodar Raja Narasimha), జూపల్లి కృష్ణారావు ,వాకాటి శ్రీహరి అన్నారు. ఆదివారం కొండారెడ్డిపల్లి గ్రామంలో రూ,134 కోట్లతో కూడిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా ముందుకెళ్తాందన్నారు. తెలంగాణ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు, కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉన్న మా ప్రజా ప్రభుత్వం విద్య, వైద్య సేవలు, యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆ దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.కొండారెడ్డిపల్లి గ్రామంలోని 516 గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు అన్నింటికీ సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామం విద్యుత్ స్వావలంబన సాధించిందని అన్నారు. గ్రామస్తులకు విద్యుత్ వినియోగంలో స్వాతంత్ర్యం కల్పించడమే కాకుండా ఆర్థిక ఆదాయాన్ని కూడా గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ఏర్పాట్లతో పాటు, విద్యార్థులకు నైపుణ్యమైన విద్యను అందించడం,  ప్రతి జిల్లాలో డయాబెటిస్ నుండి క్యాన్సర్ వరకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలు జరిగిన గంటలోపు వైద్యం అందించే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రులు పేర్కొన్నారు. నైపుణ్యం పెంచుకోవడానికి ప్రభుత్వం అన్ని అవకాశాలను కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవాలని మంత్రులు యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా. వంశీకృష్ణ, డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, వివిధ శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కొండారెడ్డిపల్లి అభివృద్ధి కమిటీ చైర్మన్, కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ , ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం, గ్రామస్థాయి నాయకులు, పాల్గొన్నారు.