చెరువులో మునిగి వ్యక్తి గల్లంతు
-గ్రామంలో కలకలం
వెంకటాపూర్, డిసెంబర్22(విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో స్నానానికి వెళ్లిన వృద్ధుడు చెరువులో మునిగి గల్లంతైన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఎల్లావుల చేరాలు (60) ఆదివారం గ్రామ శివారులోని గుర్ర మల్లయ్య కుంట చెరువులో స్నానానికి వెళ్లగా.. స్నానం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో చేరాలు నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
వెంటనే వెంకటాపూర్ పోలీసులకు సమా చారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో చేరాలు ఆచూకీ కోసం అనుభవం కలిగిన ఈతగాళ్లను దింపగా, మరోవైపు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సోమవారం రోజున చేరాలు మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెరువుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ విషాద ఘటనతో వెంకటాపూర్ మండల కేంద్రంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.






