calender_icon.png 3 July, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందకోడిగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్

02-07-2025 12:00:00 AM

  1. నెలవారీ ప్రగతిని ఎందుకు సమీక్షించడం లేదు 
  2. రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిని భారీగా పెంచాలి 
  3. ఉద్యానశాఖ సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయని, రాష్ట్రానికి అవసరమైన కూరగా యలను మన వద్దే పండించేలా రైతులను ప్రోత్సహించాలని, అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా డిమాండ్‌కు అనుకూలంగా కూరగాయల సాగును ప్రోత్సహించాలని మంత్రి సూచించారు.

ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ చాలా మందకోడిగా నడుస్తుందని మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని, జిల్లాలు, కంపెనీల వారిగా పురోగతిని సమీక్షించాలన్నారు. ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని, కూరగాయల సాగును పెంచేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో పెద్ద ఎత్తున కూరగాయల సాగును ప్రోత్సహించాలని మంత్రి సూచించారు.

ప్రధాన కార్యాలయంలో ఉన్న జాయింట్ డైరెక్టర్లు ఒక్కొక్కరికి 5 జిల్లాలు కేటాయించాలని, వారంలో మూడు రోజులు వారు ఆయా జిల్లాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డిసెంబర్ నెలాఖరు వరకు ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ర్టంలో 12.96 లక్షలో ఎకరాలలో ఉద్యానపంటలు సాగులో ఉన్నాయని, 42.58 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ డైరెక్టర్ మంత్రికి వివరించారు. 

ఉద్యాన పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పెద్దఎత్తున తుంపర, సేద్య పరికరాలపై రాయితీ ఇస్తుందని చెప్పారు. 2025 - -26 సంవత్సరానికి 51,328 ఎకరాల విస్తీర్ణానికి పరిపాలన అనుమతులు తీసుకున్నా మని, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 28,147 ఎకరాల విస్తీర్ణానికి బిందు, తుంపర సేద్య పరికారాలు ఏర్పాటు చేసినట్టు ఉద్యాన శాఖ డైరెక్టర్ వివరించారు.

2024-25లో 110.87 కోట్ల వ్యయంతో 12,054 మంది రైతులు 40,247 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టారని చెప్పారు. 2025--26కు సంబంధించి 1,25,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యాన శాఖ సంచాలకులు యాస్మిన్ బాషా, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.