02-07-2025 12:00:00 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూలై 1: విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.మంగళవారం మండల కేంద్రం అర్వపల్లిలోని పీహెచ్సీ,తహశీల్దార్ కార్యాలయంతో పాటు జాజిరెడ్డిగూడెం గ్రామంలోని ప్రాథమిక,ఉన్నత పాఠశాల,అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి అభినందించారు.అనంతరం రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు చేశారు.అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని,టీహెచ్‌ఆర్ రికార్డు వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం పీహెచ్సీ ని తనిఖీ చేసి గర్భిణీలకు అందే సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో సహజ కాన్పులు అయ్యే విధంగా వైద్య సిబ్బంది గ్రామాలలో అవగాహన కల్పించాలని,సిబ్బంది సమయపాలన పాటించాలని,విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.తదనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి సదస్సుల ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను త్వరగా పరిష్కరించాలని చెప్పారు.
క్షేత్రస్థాయి పరిశీలనకు నోటీసులు జారీ చేసిన మండలంలోని బొల్లంపల్లి,కుంచమర్తి గ్రామాలకు చెందిన ఆర్జీలను కలెక్టరే స్వయంగా పరిశీలించారు ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ వేణుమాధవరావు, తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంపీడీఓ గోపి, మండల వైద్యాధికారి భూక్య నగేష్ నాయక్, మండల విద్యాధికారి బాలునాయక్, గిర్దవార్లు జలంధర్,వెంకటరెడ్డి, హెల్త్ సూపర్వైజర్ లలిత, ఉపాధ్యాయులు, అధికారులు, ఆయా విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.