6 April, 2026 | 5:43 AM

‘మానుకోట’.. పోలింగ్ బాట

14-05-2024 02:25 AM

పార్లమెంట్ నియోజక వర్గంలో ఓటింగ్ ప్రశాంతం

ఉదయం మందకొడిగా ప్రారంభమై మధాహ్నానికి వేగం

అవాంఛనీయ ఘటన ఒక్కటైనా లేదు

వరంగల్, మే 13 (విజయక్రాంతి): మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సోమవారం లోక్‌సభ ఎన్నికలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉదయం పోలింగ్ సరళి నెమ్మదిగా ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం పరిధిలోని పినపాక, ఇల్లెందు, భద్రాచలంతో పాటు ఉమ్మడి వరంగల్ లో ని ములుగు, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట స్థానాలు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండడం, గిరిజన, మారు మూల ప్రాంతాలు ఎక్కువగా కలిగి ఉన్న నియోజకవర్గం కావడంతో అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. రవాణాకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించారు. అటవీగ్రామాలు, మరీ ముఖ్యం గా రిమోట్ ఏరియాల్లో అధికారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి, ఓటర్లు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొనడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 

ఓటేసిన ప్రముఖులు..

బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత మహబూబాబాద్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ కంకరబోడ్, మంత్రి సీతక్క ములుగు జిల్లా జగ్గ న్నపేట, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ మరిపెడ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కురవి మండలం పెద్దతండాలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మధ్యాహ్నానికి ఊపందుకున్న పోలింగ్ 

ఓటింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లో కేవలం 11.94 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అధికారులు ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం, ఓటర్లను ప్రేరేపించడం వంటి చర్యల కు దిగడంతో ఓటింగ్ శాతం నెమ్మనెమ్మదిగా పెరగడం కనిపించింది. సాయంత్రం 5 గంటల వరకు 68.6శాతం పోలింగ్ నమోదైంది. మహబూబాబాద్, డోర్నకల్, భద్రా చలం నియోజకవర్గాల్లో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. తర్వాత కొంచెం కొంచెంగా ఓటింగ్ పెరగ డం కనిపించింది. ఓటర్లు కుటుంబ సమేతంగా కేంద్రాలకు తరలారు. మహబూబా బాద్, డోర్నకల్ పట్టణాల్లో మధ్యాహ్నం తర్వాతే అధికశాం ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం లంచ్ విరామం తర్వాత పోలింగ్ కేంద్రాల్లో రద్దీ పెరిగింది. 

ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం..

యంత్రాంగం సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎన్నికల అధికారులను అప్రమత్తం చేసింది. ఓటింగ్ ప్రశాం తంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల తర్వాత పోలీసులు కట్టు దిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్‌ను జిల్లాకేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్ట్రాంగ్ రూంలకు తరలించారు.