31-12-2024 12:00:00 AM
జాతీయ విద్యా విధానం- 2020 (ఎన్‌ఈపీ 2020), భారతదేశ నూతన విద్యా వ్యవస్థ దృష్టిని వివరిస్తుంది. మునుపటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో కొత్త విధానం ఉంది. పాలసీ విడుదలైన కొద్దిసేపటికే నిర్దిష్ట భాషపై ఎవరూ బలవంతం చేయరాదని, బోధనా మాధ్యమాన్ని ఇంగ్లీష్ నుంచి ఏ ప్రాంతీయ భాషలోకి మార్చబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
భారతదేశంలో విద్య అనేది ఉమ్మడి జాబితా సబ్జెక్ట్. ఈ విధానం కేంద్రం తొందరపాటుతనాన్ని చాటుతున్నది. దీంతో అమలు కోసం బహుళ పండితులు, విద్యావేత్తల నుంచి విమర్శలను ఎదుర్కొంది. కొందరు దీనిని సమాన విద్యకు ముప్పుగానూ పేర్కొన్నారు. దీని అమలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.
ముఖ్యంగా తెలంగాణలో డిగ్రీ స్థాయిలో బీఏ, బీకాం, బీఎస్సీ ఇంజినీరింగ్ కోర్సులలో పాఠ్య ప్రణాళిక (సిలబస్) రాష్ట్రమంతా ఒకే విధంగా ఉండాలని అధికారులు భావించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒకే పాఠ్య ప్రణాళిక రూపకల్పన విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కొత్త పాఠ్య ప్రణాళికను వచ్చే (2025-26) విద్యా సంవత్సరం నుంచి అమలులోకి తెస్తామని కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 1100 డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిలో ప్రతి ఏటా 2 లక్షల వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నారని అధికారిక లెక్కలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి కోర్సులు ఉండగా వాటికి కాంబినేషన్‌గా సుమారు 500 కోర్సులు కొనసాగుతున్నాయి. ఆయా కోర్సులకు తగ్గట్టుగా సిలబస్ రూపకల్పన లేదని విమర్శలు ఉన్నాయి.
ఈ క్రమంలో సిలబస్‌లో మార్పులు చేయాలని ఉన్నత విద్యాసంస్థ నడుం బిగించింది. డిగ్రీలో సిలబస్ మార్పు 2019లో చేపట్టింది. అయితే, ఇది పూర్తిస్థాయిలో జరగలేదు. 2025 విద్యా సంవత్సరం నుంచి అయినా ‘నూతన కామన్ సిలబస్’ తయారుచేసి విద్యార్థులకు అందించవలసి ఉంది. ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఉపాధి కల్పనకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒకే ప్రణాళిక కోసం కసరత్తు
కామన్ డిగ్రీ కోర్సులలో ఒకప్పటి ప్రణాళిక విధానం మానవ విలువలు, సామాజిక ఆర్థిక విషయాలపై పాఠ్యప్రణాళికలు ఉండేవి. వీటిని తొలగించి అక్కరకు రాని పాఠ్యప్రణాళికను రూపొందించారు. దీంతో పెద్దగా విద్యార్థులకు ఒరిగేది ఏమీ లేదని విద్యావంతులు, మేధావులు వ్యతిరేకించారు. అప్పటి కప్పుడు పాఠ్యప్రణాళికను రూపొందించి విద్యార్థులపై రుద్దారు.
ప్రస్తుతం ఉన్నత విద్యాసంస్థ కొత్తగా పాఠ్య ప్రణాళికను తయారుచేసి రాష్ట్రమంతట ఒకే విధమైన విధానాన్ని అమలు చేయడానికి పూనుకుంది. అయితే, గతంలో తెలుగు అకాడమీ పుస్తకాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడ్డాయి.
కేవలం నాలుగు గోడల మధ్య బోధించే విద్య విద్యార్థికి పెద్దగా ఉపయోగపడడం లేదని భావించిన ఉన్నత విద్యాశాఖ వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య ప్రణాళికతో బోధన కొనసాగేలా చర్యలు చేపట్టింది. కొత్త పాఠ్య ప్రణాళికలో తరగతి గది బోధన 40 శాతం, ఫీల్డ్ వర్క్ 60 శాతం ఉండేలా ప్రణాళికను రూపొందించాల్సి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలలో ఒకే విధమైన పాఠ్య ప్రణాళికను అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. కొత్త పాఠ్య ప్రణాళికను ప్రవేశపెట్టినప్పుడు అధ్యాపకులకు ఓరియంటేషన్ నిర్వహించాలి. నూతన పాఠ్య ప్రణాళిక బోధన విధానాన్ని నిపుణులైన అధ్యాపకులతో బోధించాల్సి ఉంటుంది.
ఇప్పటికైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేపట్టిన కొత్త పాఠ్యప్రణాళిక రూపకల్పన వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చేలా చూడాలి. ఇందుకు కావలసిన పుస్తకాలను కూడా ముద్రించి విద్యార్థులకు అందించాలి.
డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి