25 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగులూరు పీఎస్‌లో ఘటన
హైదరాబాద్, మార్చి 31(విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం ఒకేసారి 25 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో గంగులూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో గంగులూరు ఏరియా కమిటీ, కిష్టారం ఏరియా కమిటీ, భైరమ్‌గఢ్ ఏరియా కమిటీలకు చెం దిన ముఖ్యమైన సభ్యులు ఉన్నారు.
వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ కార్యదర్శులు, ఒకరు సంయుక్త కార్యదర్శి, నలుగురు ట్రెజర్లు, ఆరుగురు కార్యవర్గ సభ్యులు, ౧౨ మంది సాధారణ సభ్యులు ఉన్నారు. అందులో కొందరిపై ప్రభుత్వం గతంలోనే పెద్ద ఎత్తున రివార్డులు ప్రకటించింది. పీఎల్‌జీఏ కీలక సభ్యుడు మోతిరామ్ ఒయామ్, కేఏఎంఎస్ అధ్యక్షురాలు సుక్మతి ఒయామ్, మిలీషియా కమాండర్ మడ్వి భీమా లొంగిపోయిన వారి జాబితాలో ఉన్నారు.
వీరి లొంగుబాటును జిల్లా ఎస్పీ, సీఆర్పీఎఫ్ అధికారులు ధృవీకరించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు తక్షణ సహాయంగా రూ.25వేలు నగదు, పునరావాస ప్యాకేజీని అందజేశారు. నక్సల్స్ మిషన్ 2026 గడువు మార్చి ౩౧న ముగియనుండడంతో మావోయిస్టులు తమ ఆయుధాలతో లొంగిపోయారు.




