calender_icon.png 8 January, 2026 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22.40 కిలోల గంజాయి పట్టివేత

06-01-2026 12:28:53 AM

రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు

బూర్గంపాడు సారపాక, పాల్వంచలో తనిఖీలు

బూర్గంపాడు/పాల్వంచ,జనవరి 5 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం వేర్వేరు ఘటనల్లో 22.4౦ కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. స్కూటీపై గంజాయి తరలిస్తూ బూర్గంపాడు పోలీసులకు పట్టుబడిన సంఘటన సారపాకలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు ఆంధ్ర ప్రదేశ్‌లోని సీలేరు వైపు నుంచి జగ్గయ్యపేట వైపు భద్రాచలం మీదుగా స్కూటీపై జగ్గయ్యపేట మండలానికి చెందిన కన్నెగంటి ఈశ్వర్ గోపీనాథ్, గూటి నాగరాజు గంజాయి తరలిస్తుండగా సారపాకకు చేరుకోగానే వాహనం అదుపుతప్పి కిందపడింది.దీంతో వెనుక కూర్చున్న నాగరాజు పరారు కాగా ఈశ్వర్ గోపీనాథ్ కు ప్రమాదంలో గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న ఎస్‌ఐ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని వాహనం తనిఖీ చేయగా 15 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి గోపీనాథ్‌ను అదుపులోకి తీసుకుని సరుకును స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.7.65 లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే పా ల్వంచ పట్నంలో 7.4 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి పాల్వంచకు బైక్‌పై తీసుక వస్తున్న 7.4 కేజీల గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందంసోమవారం పట్టుకున్నారు.

కేశవాపురం పంచాయతీ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై ఎస్‌ఐ శ్రీహరి రావు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో గొల్లపల్లి చిరాకుపల్లికి చెందిన సాంబశివరావు, భూక్య శ్రీహరి, పోతుల చిన్న లను అరెస్టు చేశారు.గంజాయిని పట్టుకున్న బృందాన్ని ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్థన్ రావు, అసిస్టెంట్ కమిషనర్ జి. గణేష్, ఏఈఎస్ తిరుపతి అభినందించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 3.50 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు.