calender_icon.png 7 January, 2026 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మాటికి అడ్డుకుంటాం

06-01-2026 12:28:59 AM

‘పోలవరం--నల్లమల’ గోదావరి జలవివాద 

ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘించడమే

  1. వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ, ఇతర శాఖలకు లేఖలు
  2. హరీశ్ చూపించిన లేఖను సీడబ్ల్యూసీ ఆమోదించలేదు
  3. మీడియాతో చిట్-చాట్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం--నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తేలేదని, ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు ముమ్మాటికి గోదావరి జలవివాద ట్రిబ్యునల్ 1980 అవా ర్డ్‌తో పాటు అంతర్రాష్ట్ర జల నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టంచేశారు. సోమవారం శాసనసభలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాతో చిట్-చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ, మాజీ మంత్రి హరీశ్‌రావు చూపిస్తున్న లేఖ సీడబ్ల్యూసీ అంత ర్గతంగా సమాచారం కోసం పంపిన లేఖ మాత్రమేనని, ఎంత మాత్రం సీడబ్ల్యూసీ ఆమోదించినదికాదని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర జల హక్కులపై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ పూనుకుందని ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని కొట్టి పారేశారు.

పోలవరం -నల్లమల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఆర్‌ఎంబీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలతో పాటు కేంద్ర జల కమిషన్, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయంతో పైన పేర్కొన్న సంస్థలన్నీ ఏకీభవించాయని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 4న కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖనే ఇందుకు నిదర్శనమన్నారు.

అంతటితో ఆగకుండా భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇదే ప్రాజెక్టును ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కుడా ఆక్షేపిస్తు న్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడడంతో పాటు గట్టి వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్విని నియ మించిందని ఆయన పేర్కొన్నారు.

వాదనలు వచ్చే సోమవారం రోజుకు వాయిదాపడ్డాయని, రిట్ పిటిషన్‌ను సూట్ పిటిషన్‌గా మార్చి దాఖలు చేయాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే సోమవారం జరగనున్న వాదనలకు స్వయంగా తాను హాజరవుతానని, మళ్ళీ స్టే ఆర్డర్ కోరతామని తెలిపారు. ఇదే విషయమై రానున్న రెండు రోజుల్లో న్యాయవాదులతో ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పధకం పనులను నిలువరించడంలో విజయం సాధించమన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదటనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పాలకులు జల వనరుల నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో మాటలకు చేతలకు ఎక్కడ పొంతనలేదని విమర్శించారు.

జూరాల నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలంకు, తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు కాళేశ్వరం ఎత్తిపోతల పధకం కింద తుమ్మిడిహట్టి ప్రాజెక్టును రీ- డిజైన్ చేయడం వంటి నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ తరాల మీద మోయలేని భారాన్ని బీఆర్‌ఎస్ పాలకులు మోపారని దుయ్యబట్టారు.