16-08-2025 04:42:45 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): వ్యవసాయ మార్కెట్లలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులకు నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని మార్కెట్ సెక్యూరిటీ గార్డుల సంఘం(సిఐటియు అనుబంధం) ను రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల సాంబయ్య(State President Tummala Sambaiah) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మహబూబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గంగరబోయిన వెంకటనారాయణ అధ్యక్షతన తెలంగాణ వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గాడ్స్(సిఐటియు) అనుబంధం జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ మహాసభను ఉద్దేశించి తుమ్మల సాంబయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు మాట్లాడుతూ, గత 30 ఏళ్ల నుండి చాలీచాలని వేతనాలతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ మార్కెట్లో సెక్యూరిటీ గార్డులు గా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఏండ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నప్పటికీ సెక్యూరిటీ గార్డ్స్ కు కనీస వేతనాలు అమలు చేయకుండా, వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని విమర్శించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కార్మికులకు నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని చెప్పినా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తూ కనీస వేతనాలు ఇవ్వకుండా సెక్యూరిటీ గార్డ్స్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ గార్డ్స్ ను స్కిల్ ఉద్యోగులుగా గుర్తించాలని, పేరుకే సెక్యూరిటీ గార్డ్స్ విధులు అంటూ, అందుకు విరుద్ధంగా వారితో వేలం పాటలు, క్లర్కు పనులు, చెక్పోస్టులో వాహనాలను తనిఖీలు చేయించడంలో ఉపయోగించుకుంటూ ఆన్లైన్ ద్వారా రసీదులు జారీ చేయించడం మార్కెట్ ఫీజులు వసూలు చేయడంతో అన్ని పనులు చేయించుకుంటూ కనీస వేతనాలు అమలు చేయకపోవడం చాలా బాధాకరమన్నారు.
సెక్యూరిటీ గార్డ్స్ కు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా కాకుండా మార్కెట్ కమిటీల ద్వారానే వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ గార్డ్స్ కు భీమా సౌకర్యం, ఈపీఎఫ్, ఈఎస్ఐ పగడ్బందీగా అమలు చేయాలని, 61 ఏళ్లు దాటిన సెక్యూరిటీ గార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, చనిపోయిన సెక్యూరిటీ గార్డ్స్ కు అంత్యక్రియల ఖర్చుల కింద 25వేల రూపాయలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సెక్యూరిటీ గార్డ్స్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గంగారబోయిన వెంకట్ నారాయణ, కార్యదర్శిగా గొట్టుమంచి బిక్షపతి, కోశాధికారిగా రావుల మల్లయ్య, ఉపాధ్యక్షులుగా యార ముత్తయ్య, ముల్క సారయ్య, సహాయ కార్యదర్శిగా సరోజ, కమిటీ సభ్యులుగా ఆంజనేయులు, సురేష్, ఎండి హుస్సేన్, జి.రమేష్, జి.కిషన్ ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో వివిధ మండలాల సిఐటియు మండల కార్యదర్శిలు కుమ్మరి కుంట్ల నాగన్న, జల్లే జయరాజు, పెదగోని రాము, జనార్ధన్, రాములు, మంగు యాకయ్య, లక్ష్మి, సంధ్య, సోమ్లి, సోమని, యాకన్న, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.