వివాహిత ఆత్మహత్య
తాడ్వాయి, మే,15 (విజయక్రాంతి): కుటుంబ కలహాలు పెరిగిపోయి మనసుపై విరక్తి చెంది ఓ వివాహిత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన శెట్పల్లి మంజుల (25) అనే వివాహిత కుటుంబ కలహాలు తట్టుకోలేక ఈనెల 13న ఇంటి ముందున్న షెడ్డులో గడ్డి మందు తాగింది.ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే మెరుగైన వైద్య చికిత్సల కోసం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.అక్కడ పరిస్థితి విషమంగానే ఉండడంతో తిరిగి కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మంజుల మృతి చెందింది. మృతురాలికి భర్త నవీన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తండ్రి తూర్పు దేవయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర నరేష్ తెలిపారు.






