ఆయిల్‌ఫామ్‌కు భారీ ప్రోత్సాహం
- తెలంగాణలో వరిసాగుకు ప్రత్యామ్నాయం
- సూర్యాపేటలో హబ్‌కు రిలయన్స్ ఆసక్తి
- కోదాడ-, హుజూర్‌నగర్ నుంచే విస్తరణకు శ్రీకారం
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): నీటిని అధికంగా వినియోగించే వరిసాగుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తూ, రైతులకు స్థిరమైన, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌ఫామ్ సాగుకు భారీ ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించిందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయిల్‌ఫామ్ తోటల విస్తరణతో పాటు ప్రాసెసింగ్, రిఫైనింగ్, అనుబంధ పరిశ్రమలను ఒకే గొలుసులో అనుసంధానిస్తూ సమగ్ర ఫార్మ్ టు ఇండస్ట్రీ ఆయిల్‌ఫామ్ వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందని తెలిపారు.
బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖేతన్ మోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సమావేశమైంది. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ అర్పన్ బసు, స్టేపుల్స్ విభాగం అధిపతి సంజీవ్ గిరి, ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రైతును వరిసాగు నుంచి మరో పంటవైపు మళ్లించాలంటే కేవలం సూచనలు సరిపోవని, ప్రత్యామ్నాయ పంట వరికంటే మెరుగైన ఆదాయం ఇవ్వడంతో పాటు భరోసా, పంట చేతికొచ్చిన వెంటనే కొనుగోలు, ప్రాసెసింగ్‌కు వ్యవస్థ సిద్ధంగా ఉండాలన్నారు.కోదాడ-హుజూర్‌నగర్ ప్రాంతాన్ని ఆయిల్‌ఫామ్ ప్లాంటేషన్-ప్రాసెసింగ్ క్లస్టర్‌కు ప్రారంభ కేంద్రంగా పరిశీలించాలని రిలయన్స్ ప్రతినిధులకు ఉత్తమ్ సూచించారు.
ఈ సమావేశంలో పలు ఉత్పత్తులపై చర్చించినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 3,12,275 ఎకరాల్లో 65,691 మంది రైతులు ఆయిల్‌ఫామ్ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో సుమారు 5,753 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోందన్నారు. ఒకసారి మొక్కలు నాటితే 30 ఏళ్ల వరకు రైతుకు ఆదాయం వస్తుందన్నారు. తెలంగాణ ఆయిల్‌పామ్ కార్యక్రమంతో 14 సంస్థలు అనుసంధానమై ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.






