calender_icon.png 16 September, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1పై రాజకీయాలొద్దు.. ర్యాంకర్ల పేరెంట్స్ కన్నీళ్లు

16-09-2025 12:40:49 PM

హైదరాబాద్: గ్రూప్-1 ర్యాంకర్లను(Group-1 Rankers) ప్రభుత్వం ఆదుకోవాలని మీడియా సమావేశంలో ర్యాంకర్ల తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రూప్-1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. 200 మంది ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ర్యాంకర్ల తల్లిదండ్రులు మాట్లాడుతూ... గ్రూప్-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయవద్దంటూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. అసత్య ఆరోపణలతో మన వేదనకు గురిచేస్తున్నారని వాపోయారు. రూ. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని ఆరోపిస్తున్నారన్న తల్లిదండ్రులు రూ. 3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తమకు తెలియదని సూచించారు. ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు.

పోస్టులు కొన్నామన్న ప్రచారంతో మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, పోస్టులు కొన్నామన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. కోర్టు తీర్పు వచ్చాకే పోస్టులు కొన్నామని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మా పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారని సూచించారు. పరీక్షలు మళ్లీ రాయాలంటే ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని చెప్పిన తల్లిదండ్రులు మళ్లీ మెయిన్స్ పెట్టినా ఆ ఫలితాలు కూడా రద్దు కావని గ్యారంటీ ఏంటీ? అని ప్రశ్నించారు. ర్యాంకులు తెచ్చుకుని కూడా మా పిల్లలు రోడ్డున పడినట్లైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటివరకు విజేతలుగా ఉన్న మా పిల్లలు.. ఇప్పుడు తలదించుకోవాల్సి వస్తోందన్నారు. తప్పుడు ఆరోపణల వల్ల మా పిల్లలు ఏమైనా చేసుకుంటే ఎవరి బాధ్యత? అని ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టు ఈ నెల 9న గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. మెయిన్స్ ఫలితాలు, జనరల్ ర్యాంకులు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని హైకోర్టు తెలిపింది. మూల్యాంకనం చేయకపోతే మళ్లీ పరీక్షలు పెట్టాలని హైకోర్టు తీర్పులో వెల్లడించింది. ప్రక్రియను 8 నెలల్లోకా పూర్తి చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు పేర్కొంది.