27-07-2025 12:31:27 AM
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా ఎంసీహెచ్‌ఆర్డీని నిలపాలని, ఇందుకోసం సంస్థకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వయం సమృద్ధి సాధించి, ఆర్థికంగా పురోగతి సాధించాలని, అప్పుడే ఆశించిన స్థాయిలో సంస్థ ఎదుగుతుందని భట్టి అభిప్రాయపడ్డా రు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగం (ఎంసీఆర్డీ) గవర్నింగ్ బాడీ సబ్ కమిటీ సమావేశం శనివారం జరిగింది.
ఈ సమావేశానికి కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంసీఆర్డీ డైరెక్టర్ జనరల్ శాంతికుమారి, అధికారులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సం స్థకు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఉన్నతాధికారి అధిపతిగా ఉన్నారని, అధికారులు, సిబ్బంది వారి సేవలను వినియోగించుకోవాలని సూ చించారు.
పరిపాలనలో దేశంలోనే మొట్టమొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించిన రాష్ర్టంగా తెలంగా ణ ఎదగాలని, అందుకు తగిన విధంగా శిక్షణ ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో ఎంసీఆర్డీ పై దృష్టి సారించలేదని, ఇకనుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్ కమిటీ సమావేశం అవుతుందన్నారు.
అన్నిస్థాయి అధికారులకు శిక్షణ
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు ఎంసీహెచ్‌ఆర్డీలో శిక్షణ ఇవ్వాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్ సహకారంతో పనిచేయడంపై శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగులకు సర్టిఫికెట్ సైతం ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.
న్యాక్ గుర్తింపు పొందేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు కూడా శిక్షణ ఇవ్వాలని, తద్వారా కేంద్ర ప్రభు త్వం నుంచి నిధులు సాధించేందుకు అవకా శం ఉంటుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల లీడర్లకు జిల్లాస్థాయిలో, మండల స్థాయిలో రెండురోజులపాటు శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కృషి చేయాలని శ్రీధర్‌బాబు సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞా నం, ఇతర అంశాల్లో మార్పులను దృష్టిలో పెట్టుకొని ఎంసీఆర్డీ అధికారులు సిబ్బందికి సైతం శిక్షణ ఇవ్వాలని, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలతో సంప్రదించే పరిస్థితి వచ్చినప్పుడు అందుకు తగిన విధంగా సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఎంసీఆర్డీ చరిత్ర, సంస్థలో ఉన్న లైబ్రరీ, ఆడిటోరియం, హాస్టల్ బిల్డింగ్స్ తదితర వసతులు, శిక్షణకు సంబంధించి ఎన్ని రాష్ట్రాలతో ఎంవోయూ కుదుర్చు కున్నది, ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగుల కు ఎన్ని రోజులు శిక్షణ ఇచ్చింది తదితర అంశాలను ఎంసీఆర్డీ డైరెక్టర్ జనరల్, వైస్ చైర్మన్ శాంతికుమారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు.