11-07-2025 12:56:05 AM
సర్కిల్, జోనల్ ఆఫీసుల్లోకి నో ఎంట్రీ!
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): జీహెఎంసీలో మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. ఇకపై సర్కిల్, జోనల్ కార్యాలయాల్లోకి మీడియాను పూర్తిగా నిషేధించి, ప్రధాన కార్యాలయంలో సైతం సమాచార పౌర సంబంధాల సీపీఆర్వో విభాగం వరకే పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై గురు వారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీవ్రంగా చర్చ జరిగింది.
కొందరు రిపోర్టర్లు అధికారులను వేధిస్తున్నారనే కారణాన్ని జీహెఎంసీ ముందుపెడుతున్నప్పటికీ, తెర వెనుక అసలు కథ వేరే ఉందని, తమ అక్రమాలు, అసమర్థత బయటపడకుండా కప్పిపుచ్చుకునేందుకే ఈ ఆంక్షల పర్వానికి తెరలేపారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని సాకుగా చూపి, సర్కిల్, జోనల్ ఆఫీసుల్లోకి మీడియాను నిషేధించాలని, వారానికోసారి ప్రెస్ రిలీజ్‌లు ఇస్తే సరిపోతుందని నిర్ణయించినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో దీనిపై అధికారిక తీర్మానం రానుందని తెలిసింది.