14-08-2025 01:50:14 AM
మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాష్ట్రానికి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నందున ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. బుధవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరన్స్ నిర్వ హించారు.
సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది ఈ మూడు రోజులు కచ్చితంగా ఆస్పత్రుల్లోనే ఉండాలన్నారు. అందరి సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలని సూచించారు.
అంబులెన్స్‌లు, 102 వాహనాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. హాస్పిటళ్లలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పవర్ కట్ అయిన మరుక్షణమే జనరేటర్స్ ప్రారంభించాలని ఆదేశించారు. ఎలక్ట్రీషియన్లను 24 గంటలు హాస్పిటల్‌లో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హాస్పిటల్స్ లోపలికి నీరు చేరకుండా, నిల్వ ఉండకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రిఆదేశించారు.