23-05-2025 12:00:00 AM
సింగరేణివ్యాప్తంగా సుమారు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే సుమారు 82,387 మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎంతోమంది సింగరేణి గనుల ప్రభావిత ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వీరిలో కొందరు సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లోనే ఔట్ పేషేంట్ చికిత్స తీసుకుంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు నెలనెలా మెడిసిన్ సైతం తీసుకుంటున్నారు.
వీరిలో బీపీ, షుగర్, గుండె, మోకాళ్ల సంబంధమైన వ్యాధులతో బాధపడేవారే ఎక్కువ. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాలు, పట్టణాల్లో పిల్లలపై ఆధారపడే వారు ప్రతి నెలా సింగరేణి డిస్పెన్సరీలకు వెళ్లి మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా డిస్పెన్సరీలకు వెళ్లిన వారికి అక్కడ పూర్తిస్థాయిలో మెడిసన్ లభించడం లేదు. వాటిల్లో మెడిసిన్ కొరత సమస్య ఉంది.
ఒక్కోసారి నెల మధ్యలనే విశ్రాంత ఉద్యోగులు ఆసుపత్రులకు రావాల్సి వస్తున్నది. వయోభారాన్ని మోస్తున్న విశ్రాంత ఉద్యోగులు అన్ని సార్లు డిస్పెన్సరీలకు వెళ్లడం ఆరోగ్యరీత్యా మంచిదికాదు. కాబట్టి సింగరేణి యాజమాన్యం సంస్థ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. విశ్రాంత ఉద్యోగులకు అవసరమైన మెడిసిన్‌ను ఎప్పటికప్పుడు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలి.
ఆళవందార్ వేణు మాధవ్, హైదరాబాద్