26 April, 2026 | 2:23 AM

నేరుగా చర్చలుండవ్!

26-04-2026 01:01 AM

అమెరికాకు మేం ఏం చెప్పాలనుకున్నా.. పాక్ ద్వారానే చెప్తాం..

ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ

పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో ముగిసిన భేటీ

వాషింగ్టన్/ టెహ్రాన్, ఏప్రిల్ 25: అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన రెండోవిడత శాంతిచర్చల అంశంపై అనిశ్చితి కొనసాగుతూనేఉంది. అమెరికా బృందంతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తెగేసి చెబుతున్నది. తమ అభిప్రాయం ఏదైనా పాకిస్థాన్ ద్వారానే ప్రకటిస్తామని ప్రకటించింది. ఇలాంటి సందర్భంలో శనివారం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ తన బృందంతో కలిసి ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

ఇరాన్ బృందం కేవలం ప్రాంతీయ పరిస్థితులపై మాత్రమే చర్చించిందని, తమ మధ్య అమెరికాతో చర్చల ప్రస్తావన రాలేదని పాక్ ప్రధాని షరీఫ్ స్పష్టం చేశారు. భేటీకి సంబంధించిన వీడియోను పాక్ ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. విదేశాంగ మంత్రి ఇషాక్‌దార్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చర్చల్లో పాల్గొన్నారు. భేటీలో ఇరాన్ తన డిమాండ్లతో కూడిన ప్రతిపాదనలను పాక్‌కు అందజేసింది.

అమెరికన్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఇస్లామాబాద్ చేరుకోవడానికి ముందే ఇరాన్ బృందం అక్కడి నుంచి నిష్ర్కమించడం గమనార్హం. మరోవైపు, అమెరికన్ బృందం మాత్రం ఎప్పుడెప్పుడు చర్చలు జరుగుతాయా.. అని ఎదురుచూస్తున్నది. ఏదేమైనా, పాక్ మాత్రం మరింత పట్టింపుతో రెండు దేశాల మధ్య సయోధ్య కుదు ర్చాలని ప్రయత్నిస్తున్నది. శాంతిచర్చలకు అన్ని విధాలుగా ఇస్లామాబాద్‌ను సిద్ధం చేస్తున్నది. ఐదురోజులుగా నగరంలో కట్టుదిట్టమై న భద్రత అమలవుతున్నది. సుమారు 10,000 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు.

హోర్ముజ్ వద్ద ప్రతిష్టంభన

ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన కొనసాగుతున్నది.ఇరాన్ ఎనిమిది వారాలుగా జలసంధి వద్ద ఇతర దేశాల నౌకల రాకపోకలను అడ్డుకుంటున్నది. అందుకు ప్రతిచర్యగా అమెరికా కూడా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధం విధించింది. శాంతి ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధం కొనసాగుతుందని ఇప్పటికే స్పష్టం చేసింది.

ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు రవాణా భారీగా పడిపోయింది. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఇరాన్ మంత్రులు పాకిస్థాన్, మస్కట్, మాస్కోలో పర్యటించనున్నారు. మరోవైపు, తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. జలసంధి వద్ద అమెరికా శాశ్వత దిగ్బంధం విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీని పక్కన పెట్టే వరకూ తమ ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

తమ మిత్ర దేశాలకు ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు ఉండకూడదనేది తమ ఆకాంక్ష అని తెలిపారు. తమ అనుమతి లేకుండా హోర్ముజ్‌లోకి ఏ రవాణా నౌక రాదని, బయటకు వెళ్లదని వెల్లడిఒచారు. జలసంధిలోని నౌకలపై దాడులు చేస్తూ. ఇరాన్ సముద్రపు దొంగల ముఠాలా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియాన్ని బేషరతుగా వదులుకోవాలనీ, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు ఆటంకం కలిగించకూడదని పునరుద్ఘాటించారు.

ఇరాన్ నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణ

అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలైన రెండు నెలల తర్వాత ఇరాన్ శనివారం తిరిగి తన వాణిజ్య విమాన సర్వీసులను పునరుద్ధరించింది. తొలిరోజు టెహ్రాన్‌లోని ఇమాం ఖమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇస్తాంబుల్, మస్కట్, మదీనా వంటి నగరాలకు విమానాలు నడిచాయి.