04-08-2025 12:07:26 AM
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేశ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 31న విడుదలై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సత్యదేవ్.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు అన్నగా నటించారు. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో సత్యదేవ్ పాత్రికేయులతో ముచ్చటించారు.
ఇప్పటిదాకా ఈ సినిమాకు వచ్చినన్ని ఫోన్ కాల్స్ నాకు ఎప్పుడూ రాలేదు. భారీతనం, విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి అంశాలు తోడై.. ‘కింగ్‌డమ్’ సినిమా తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి చేరువైంది. నా నమ్మకం నిజమై, సినిమాకు ఇంతటి ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉంది.
శివ పాత్ర కోసం మొదట గౌతమ్ నా పేరే రాసుకున్నారట. కానీ, ఏవో కారణాల వల్ల నన్ను సంప్రదించలేదు. మధ్యలో వేరే నటులతో కూడా చేద్దామనుకున్నారు. సరిగ్గా షూటింగ్ కి వెళ్లడానికి కొద్దిరోజుల ముందు గౌతమ్ నన్ను కలిసి ఈ కథ చెప్పారు. అప్పుడు గౌతమ్ ‘శివ పాత్ర కోసం నేను మొదట ఎవరి పేరు రాసుకున్నానో.. వాళ్లతోనే చేస్తుండటం సంతోషంగా ఉంది’ అని చెప్పారు.
ఎప్పుడైనా యాక్షన్ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే దాని వెనుక బలమైన ఎమోషన్ ఉండాలని నేను నమ్ముతా. ఇందులో అలాంటి ఎమోషన్ ఉంది కాబట్టే.. నా యాక్షన్ సీన్స్‌కు అంత మంచి స్పందన వస్తోంది. అసలు గౌతమ్ నా పాత్రను రాసిన తీరే అద్భుతం. సినిమాలో ఫిజికల్‌గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ మాత్రం ప్రీ క్లుమైక్స్ ఎపిసోడ్. ఇప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి, ఆ కష్టమంతా మరిచిపోయా.
బాగా నటించినంత మాత్రాన మనకు బాగా పేరు రావాలని లేదు. ఆ పాత్రను రాసిన తీరు బాగుంటే.. అప్పుడు మన నటనకు ఎక్కువ పేరు వస్తుంది. ప్రేక్షకులు శివ పాత్రలో ఉన్న ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యి.. ట్రావెల్ అవుతున్నారు. గౌతమ్ అందమైన రచన వల్లే.. నా పాత్రకు ఇంత పేరు వచ్చింది.
విజయ్‌తో నాకు అంతకముందు పరిచయం లేదు. కలిసిన తర్వాత తెలిసింది విజయ్ చాలా మంచి వ్యక్తి అని. తక్కువ సమయంలోనే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. విజయ్‌ని నిజంగానే బ్రదర్‌లా ఫీల్ అయ్యాను. విజయ్ అంత మంచి వ్యక్తి కావడం, నాతో అంత మంచిగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. సన్నివేశాన్ని, సంభాషణలను విజయ్ అర్థం చేసుకొని నటించే తీరు నన్ను ఆశ్చర్యపరిచింది.