calender_icon.png 7 September, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమోచన వేడుకలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్

07-09-2025 01:27:56 AM

  1. పరేడ్ గ్రౌండ్స్‌లో కార్యక్రమం
  2. కంటోన్మెంట్ పార్క్‌లో వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ
  3. ప్రకటించిన కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి,  రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 17న జరిగే తెలంగాణలో విమోచన వేడుకలకు ఈ సంవత్స రం ముఖ్యఅతిథిగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యులు కానున్నారు. అనంతరం కంటో న్మెంట్ పార్క్‌లో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

తెలంగాణ విమోచన దినోత్సవ వే డుకల కోసం శనివారం బీజేపీ సిటీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాం చందర్‌రావు నేతృత్వంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. తెలంగాణ విమోచన దినోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, కంటోన్మెంట్ పార్క్‌లో దివంగత ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ తదితర కార్యక్రమాలపై వారు దిశానిర్దేశం చేశారు.

నిజాం, రజాకార్ల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు గతంలో ఉమ్మడి ప్రభుత్వాలు, తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్, ఆపై కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరాకరిస్తూనే ఉన్నా యి. కాగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2022 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో ఉత్సవాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరుకాగా.. 2024లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు.

ఈయేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొని జాతీయజెండాను ఆవిష్కరించి, ప్రసంగిస్తారు.

ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో స్వాతంత్ర పోరాటయోధుల గాథలను, ఉద్యమ కథలను వివరిస్తూ.. ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించనున్నారు. ఈ ఉత్సవాలను దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు నేతలు పిలుపిచ్చారు.