calender_icon.png 7 September, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ల్యాబ్ ముసుగులో డ్రగ్స్ దందా మేడిన్ మేడ్చల్!

07-09-2025 01:47:35 AM

విలువ 12 వేల కోట్లు 

మహారాష్ర్టలో తీగ లాగితే.. చర్లపల్లిలో కదిలిన డొంక 

  1. వాగ్దేవి ల్యాబ్స్ ముసుగులో మాదకద్రవ్యాల ఉత్పత్తి 
  2. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా
  3. బంగ్లాదేశ్ మహిళ అరెస్ట్‌తో గుట్టు రట్టు 
  4. ముంబై పోలీసుల రహస్య ఆపరేషన్ 
  5. విదేశీయుడితో సహా 13మంది అరెస్టు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి)/కాప్రా: మేడ్చల్ జిల్లా చర్లపల్లి పారిశ్రామిక వాడ కేంద్రంగా దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను ముంబై పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రలో ఆగస్టు ౮న బంగ్లాదేశ్‌కి చెందిన ఓ మహిళ అరెస్ట్‌తో ముంబై పోలీసులు రహస్య ఆపరేషన్ నిర్వహించగా ఈ డ్రగ్స్ గుట్టు రట్టయింది. వాగ్దేవి ల్యాబ్స్ పేరిట ఉన్న ఫ్యాక్టరీలో పెద్దఎత్తున మిథైన్‌డైయాక్సీ మిథాంఫీటమైన్ (ఎండీ) డ్రగ్స్ తయారీని గుర్తించారు.

సుమారు రూ.12 వేల కోట్ల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ విదేశీయుడితో సహా 13 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో మాదకద్రవ్యాల తయారీకి  ఉపయోగించే  ౩౨ వేల లీటర్ల ముడి పదార్థాలను, ౫.౯౬౮ కిలోల ఎండీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ వెనకాల ఉన్న పెద్దతలలు ఎవరనేది ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ తయారైన డ్రగ్స్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. మోలీ, ఎక్స్‌టీసీ పేర్లతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గూఢచారులతో నిఘా

ముంబైలోని వీరాబయందర్ వసాయ్ విరార్ (ఎంబీవీవీ)కి చెందిన పోలీసులు  ఈ వ్యవహారంపై కొన్నాళ్లుగా నిఘాపెట్టారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం డ్రగ్ సరఫరా చేస్తున్న బంగ్లాదేశ్‌కి చెందిన ౨౩ ఏళ్ల మహిళ ఫాతిమా మురాద్ షేక్‌ను అరెస్ట్ చేశారు. ఆమెను విచారించిన అనంతరం గూఢచారులను రంగంలోకి దించి కొన్ని వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ముఠా మూలాలు తెలంగాణలోని మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్ లో ఉన్నట్లు పక్కా సమాచారం సేకరించారు.

ఈ నేపథ్యంలో మహారాష్ర్ట క్రైమ్ బ్రాంచీ పోలీసులు మెరుపుదాడి చేశారు. నకిలీ లైసెన్స్‌తో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక పరికరాలతో భారీఎత్తున మాదకద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కర్మాగారం బయటికి ఓ రసాయన పరిశో ధనశాలగా కనిపిస్తూ, లోపల దేశ భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాలను తయారుచేస్తూ వచ్చింది. ఈ దాడిలో సుమారు రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను ముంబై క్రైంబ్రాంచీ పోలీసులు పట్టుకున్నారు.

ముఠాను నడుపుతున్న నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఫ్యాక్టరీ యజమాని, కెమిస్ట్రీ నిపుణుడు శ్రీనివాస్, అతని సహచరుడు తానాజీ పాఠే, ఒక విదేశీయుడు సహా 13 మంది ఉన్నారు. ఈ భారీ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు చేయడంతో ముంబై పోలీసులు దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ కేసుల్లో ఒకదానిని ఛేదించినట్లయింది. దీనిపై స్థానిక పోలీసులు కూడా ప్రత్యేక దర్యాప్తు చేపట్టనున్నారు.