07-09-2025 01:19:18 AM
కల్వకుర్తి రూరల్: విద్యా సేవే పరమావధిగా భావించి, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న కల్వకుర్తి మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ నాగమణి, రాష్ట్రస్థాయిలో అత్యున్నత గౌరవాన్ని అందుకున్నారు. ఆమె నిస్వార్థ సేవను, విద్యా రంగంలో ఆమె చూపిన అసాధారణ ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, ఆమెను ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డుతో ఘనంగా సత్కరించింది.
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శనివారం జరిగిన గురుపూజోత్సవ మహోత్సవంలో, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఎంజేపీ కార్యదర్శి సైదులు చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు స్ఫూర్తినిచ్చిందని నాగమణి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె సాధించిన ఈ విజయం కల్వకుర్తి విద్యా రంగానికి దక్కిన గౌరవంగా పలువురు అభివర్ణించారు.