07-09-2025 01:41:35 AM
అకాలవర్షాలతో ఆగమాగం
* ప్రకృతి ప్రకోపించినా.. ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబించినా ముందుగా వ్యవసాయరంగం, రైతుల పైనే ఎక్కువగా ప్రభావం పడుతుంది. దీనికి ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాలవర్షాలే తాజా నిదర్శనం. తెలంగాణలో వారం క్రితం వరకు కురిసిన అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమాగమయ్యారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
పోటెత్తిన వరదలతో వరి, పత్తి, మొక్క జొన్న, సోయాబీన్, పప్పుధాన్యాల పంటలన్నీ కొట్టుకుపోయాయి. దీంతో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడింది. పరిహారం పేరిట ప్రభుత్వం అందించే భరోసాతో రైతులకు ఎలాంటి స్వాంతన లభించే అవకాశం లేదని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది సరిపోక, అటు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): గత నెలలో కురిసిన అకా ల భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 2.36 లక్షల ఎకరా ల్లో పంట నష్టపోయినట్టు ప్రభుత్వం చెబుతుంది. అందులో 1.09 లక్షల ఎకరా ల వరి, 60 వేల ఎకరాల పత్తి, 21 వేల ఎకరాల సోయాబీన్, 16 వేల ఎకరాల మొక్కజొన్న, 6 వేల ఎకరాల హార్టికల్చర్ పంటలు, 20 వేల ఎకరాలకుపైగా ఇతర పం టలకు నష్టం వాటిల్లింది.
అయితే ప్రభుత్వం నష్టపోయిన పంటలకుగానూ ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి రైతుల లెక్క ప్రకారం ఒక ఎకరా వరి సాగు చేసేందుకు రూ. 40 వేలు, ఎకరా పత్తి సాగు చేసేందుకు రూ. 45 వేలు, ఎకరా మొక్కజొన్న సాగు చేసేందుకు రూ. 38 వేలు, ఎకరా సోయాబీన్ సాగు చేసేందుకు రూ. 20 వేల ఖర్చు వస్తుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందిం చే రూ. 10 వేల పరిహారం ఎకరా విస్తీర్ణంలో వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేసేందుకు అయ్యే పెట్టుబడిలో కేవలం 25 శాతంగా మాత్రమే ఉంటుంది. అయితే అకాల వర్షా లు, భారీ వరదల కారణంగా జరిగిన జరిగిన నష్టానికి.. ప్రభుత్వాలు ఇచ్చే పరిహారానికి పొంతనే లేదని రైతులు వాపోతున్నారు. ఆ యా పంటల పెట్టుబడిని పరిశీలించి తగిన విధంగా పరిహారం పెంచాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.
ఫసల్ బీమాతో ప్రయోజనం...
ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు, వ్యాధు ల వల్ల పంటలు నష్టపోతే బీమా ద్వారా రైతులకు ఆర్థికంగా రక్షణ కల్పించేందుకు కేం ద్రం ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా ఎకరాకు బీమా మొత్తంలో 2 శాతాన్ని రైతులు చెల్లిస్తే మిగిలిన 98 శాతం ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లిస్తాయి. 98 శాతంలో 49 శాతం కేంద్రం, 49 శాతం రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు ఒక ఎకరా వరి పంటకు కవర్ అయ్యే బీమా రూ. 40 వేలు అయితే, అం దులో రూ.800 రైతులు, రూ.19,600 కేంద్రం, రూ.19,600 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఈ క్రమంలో ఫసల్ బీమా అమలు చేయడం ద్వారా ఆయా పంటలకు నష్టం వాటిల్లినప్పుడు, ఆ పంటలపై ఉన్న మొత్తం బీమాను రైతులు పొందుతారు.
ఈ పథకం అమలులో ఉంటే ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా రైతులు నేరుగా ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి పరిహారం పొందే అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఫసల్ బీమా యోజన అమల్లో లేక రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదు ర్కొంటున్నారు.
పీఎంఎఫ్‌బీవైని నిలిపివేత
అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన సమయంలో రైతులను ఆదుకు నేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం ప్రస్తుతం తెలంగాణలో అమలు కావడంలేదు. గతంలో ఈ పథకం కింద రైతులు లబ్ధి పొందినప్పుటికీ ఈ పథకాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. 2018 సంవత్సరంలో ఈ పథకాన్ని నిలిపేయడంతో వర్షాలతో నష్టపోయిన రైతులకు ధీమా లేకుండా పోయింది.
గతంలో పత్తికి వాతావరణ ఆధారిత బీమాను, వరి, సోయ పంటలకు గ్రామ యూనిట్‌గా, ఇతర పంటలకు మండల యూనిట్‌గా పథకాన్ని అమలు చేశారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా నష్టపోయిన పంటలకు ఈ పథకం కింద పరిహారం అందిస్తారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.
ఇప్పటికే రాష్ట్రంలో ఫసల్ బీమా అమలైఉంటే ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు బీమా మొత్తం పరిహారంగా అందేది. తద్వారా రైతులకు ఎంతో ఉపశమనం లభించేది. కానీ గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక మంది రైతులు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫసల్ బీమాను పునరుద్ధరిం చడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారం కూడా పెంచి, ఆరుగాలం కష్టపడే రైతులను ఆదుకోవాలని డిమాం డ్‌లు వినిపిస్తున్నాయి.
పంట రకం సాగుకు అయ్యే
ఖర్చు(ఎకరాకు)
వరి 40,000
పత్తి 45,000
మొక్కజొన్న 38,000
సోయాబీన్ 20,000
మిరప 1,25,000
కందులు 21,000
పెసర 18,000
నువ్వులు 24,000
వేరు శెనగ 54,000
మామిడి 1,42,000
నిమ్మ 80,000
జామ 92,000
సపోట 83,000
దానిమ్మ 1,23,000
సీతాఫలం 68,000