14 March, 2026 | 2:29 AM

సందేశాత్మకంగా మా రాముడు అందరివాడు

14-03-2026 01:09 AM

యంగ్ హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా ‘మా రాముడు అందరివాడు’. ఈ చిత్రాన్ని అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్నారు. యద్దనపూడి మైకేల్ దర్శకత్వం వహిస్తున్నారు.

నిర్మాత అనుముల లక్ష్మణరావు ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. శ్రీరామ్ సరసన స్వాతి హీరోయిన్‌గా కనిపించనుంది. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేశ్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్, కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చేతుల మీదుగా ఈ సినిమాలోని ‘ఇడిసెల్లిపోయావా..’ సాంగ్ లాంచ్ చేశారు.

ఈ పాటకు డైరెక్టర్ యద్ధనపూడి మైఖేల్ సాహిత్యాన్ని అందించి, నల్లగొండ గద్దర్ నర్సారెడ్డితో కలిసి పాడారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో శ్రీరామ్, నిర్మాత, నటుడు అనుముల లక్ష్మణరావు, డైరెక్టర్, సాంగ్ రైటర్ యద్ధనపూడి మైఖేల్, సింగర్ గద్దర్ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో తండ్రిని కోల్పోయిన కొడుకు, గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఊరి ప్రజలు కలిసి విషాదంతో పాడుకునే ఒక అద్భుతమైన పాట ఇది. చాలా బాగుంది. మంచి సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆదరించాలి. ఇలాంటి కొత్త టాలెంట్‌ను అంతా ప్రోత్సహిం చాలని కోరుకుంటున్నా” అన్నారు.