calender_icon.png 4 August, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు

04-08-2025 04:14:17 PM

ఇఫ్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్

మహబూబాబాద్,(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశిర పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడిందని ఇఫ్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అన్నారు. ప్రధానంగా లేబర్ కోడ్స్ రద్దు, పని గంటల తగ్గింపు, కనీస వేతనాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణంలోని అమీనాపురంలో జరిగిన జిల్లా విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తులకు అనుకూల విధానాలను రూపొందిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను ముమ్మరం చేసిందన్నారు.

ముఖ్యంగా రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాల భాగంగా రైతులకు భూమిపై హక్కులు నిరాకరిస్తూ, కార్మిక వర్గానికి ఉన్న మౌలిక హక్కులను రద్దు చేస్తూ మూడు నల్ల సాగు చట్టాలను, నాలుగు లేబర్ కోడ్స్ ను ముందుకు తెచ్చిందన్నారు. భారత రాజ్యాంగానికి భిన్నంగా, వాటి ఆధారంగా వచ్చిన చట్టాలను బుట్ట దాఖలు చేస్తూ, కనీస వేతనాలను, సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్న విధానాలపై కార్మిక వర్గం బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 16, 17 తేదీలలో కేసముద్రం మండల కేంద్రంలో జరిగే ఐ.ఎఫ్.టి.యు రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో ఆ మేరకు తగిన ఉద్యమ కార్యచరణ  రూపొందిస్తామని చెప్పారు.