04-08-2025 06:36:57 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): తన తల్లి షేక్ హలీమా బేగం మృతికి కారకులైన బెల్లంపల్లి 100 పడకల ఏరియా ఆసుపత్రి సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి పట్టణంలోని గోల్ బంగ్లా బస్తీకి చెందిన షేక్ ముక్తియార్ సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత నెల 28న రాత్రి తన తల్లి హై బీపీతో బాధపడుతుండడంతో బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రికి తీసుకెళ్లగా గేట్ సెక్యూరిటీ గార్డ్ వచ్చి బీపీ చెక్ చేశారని అందులో మానిటర్ 90/60 చూపగా సిస్టర్ కి తెలిపారని పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ఇంజక్షన్ తో పాటు టాబ్లెట్ ఇచ్చి మళ్లీ మ్యానువల్ లో చెక్ చేయగా బీపి 220/60 చూపిందని పేర్కొన్నారు. దీంతో డాక్టర్ సిబ్బందిపై ఆగ్రహం చెంది మళ్లీ నాలుగు ఇంజక్షన్లు ఇచ్చి పంపింగ్ చేయడం ప్రారంభించినట్లు ముక్తియార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
పంపింగ్ చేసే సమయంలో డాక్టర్ హుటాహుటిన పోలీసులను పిలిపించి పల్స్ నడుస్తున్నట్లు చూపించి మంచిర్యాలకు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. డాక్టర్ ఇచ్చిన సమాచారం తో అంబులెన్స్ డ్రైవర్ కి ఫోన్ చేస్తే డీజిల్ పోస్తేనే వస్తానని సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు. తాము 108 అంబులెన్స్ లో తన తల్లిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందినట్లు ముక్తియార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తన తల్లి హై బీపీని లో బిపి 90/60 చూపడం, పెరిగిన బీపి ని మరింత పెంచేలా ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే తన తల్లి మృతి చెందినట్లు ముక్తియార్ పేర్కొన్నారు. గత నెల 28న బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రిలో రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని షేక్ ముక్తియార్ జిల్లా కలెక్టర్ ను కోరారు.