04-08-2025 06:40:41 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, ఆర్టీవో లోకేశ్వర్ రావులతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కౌటాల మండలం గుడ్ల బోరి గ్రామానికి చెందిన బడికే సదాశివ్ తనకు 65 సంవత్సరాల వయసు ఉన్నందున వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. రెబ్బెన మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన నంది రజిత తాము పులికుంట గ్రామ శివారులో గల తమ భూమిలో సాగు చేసిన పత్తి పంటను వేరే వ్యక్తి ధ్వంసం చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ కు చెందిన పోరండ్ల రాజేశ్వర్ తన పేరిట పట్టా గల భూమి అడ ప్రాజెక్టు నిర్మాణంలో పోయినందున నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఆసిఫాబాద్ పట్టణం లోని బజార్ వాడికి చెందిన తిందాం భాగ్యలక్ష్మి నిరుపేద అయిన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన సుగుణ తాము చిన్న ఇంట్లో నివసిస్తున్నందున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. వాంకిడి మండలం కమాన గ్రామానికి చెందిన వసాకే రాధాబాయి కమన నుండి కణార్గాం గ్రామానికి వెళ్లే దారిని గ్రామానికి చెందిన వ్యక్తి ఆక్రమించుకున్నారని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ లో వచ్చే దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలల అదనపు గదులు, అంగన్వాడి కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.