బరిలో కోటీశ్వరులు

26-04-2024 12:54:23 AM

రంగారెడ్డి, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి కోటీశ్వరులు బరిలో దిగుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వందల, వేల కోట్ల ఆస్తులున్న అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఆయా నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది. వీరిలో చాలా మంది అభ్యర్థులకు సొంత కారు కూడా లేదని అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం. 

మాధవీలత రూ.221.40 కోట్లు...

హైదరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న మాధవీలతకు రూ.221 కోట్ల ఆస్తులున్నాయని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే రూ.27.03 కోట్ల అప్పులు, విరించి లిమిటెడ్, వివో బయోటెక్‌లలో రూ.8.92 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని తెలిపారు. ఓ క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. కనీసం రెండు వందల కోట్లకుపైగా సంపద ఉన్న మాధవీలతకు సొంతంగా ఓ కారు కూడా లేదని పేర్కొన్నారు.   

రంజిత్‌రెడ్డి.. 

చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి రూ.158.81 కోట్లు, భార్య సీతాదేవి పేర రూ.135.52 కోట్ల ఆస్తులున్నాయని అఫిడవిట్‌లో తెలిపారు. ఆయన కుమారుడు రాజేశ్వర్‌రెడ్డి పేర రూ.14.17 లక్షల విలువ చేసే ఆస్తులున్నాయని, రూ.37.83 లక్షల విలువ చేసే బంగారం ఆభరణాలు, సతీమణి పేర రూ.1.59 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే వివిధ బ్యాంకులలో రూ.20.39 కోట్లు, భార్యకు 2.62 కోట్లు ఉన్నాయి. కానీ ఈయనకు కారు లేదని అఫిడవిట్‌లో తెలిపారు. ఓ క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉంది. 

వెంకట్రామిరెడ్డి..

మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి రూ.37.85 కోట్ల విలువైన స్థిరాస్తులు, ఆయన సతీమణి ప్రణీతరెడ్డి పేర రూ.15.68 కోట్ల ఆస్తులున్నాయని అఫిడవిట్‌లో తెలిపారు. రూ.1.016లక్షల నగదు, 100 గ్రాముల బంగారం ఉందని వెల్లడించారు. అయితే వెంకట్రామిరెడ్డికి కూడా కారు లేదని పేర్కొన్నారు .  

దానం ఆస్తులు రూ.31.63 కోట్లు 

కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్‌కు రూ.31.63 కోట్ల ఆస్తు లు, రూ.6.40 కోట్ల ఆప్పులున్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.4.50లక్షలు, భార్య వద్ద రూ.4.10 లక్షలు, కూమార్తె వద్ద రూ.6.27 లక్షల నగదు ఉన్నదని తెలిపారు. అయితే దానం నాగేందర్‌కు కూడా సొంత వాహనం లేదు.

కాసాని జ్ఙానేశ్వర్ ముదిరాజ్...

చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్‌కు రూ.15.12 కోట్ల ఆస్తులున్నాయి. తన పేర రూ.3.16 కోట్లు, సతీమణి పేరు రూ.11.95 కోట్ల ఆస్తులతో పాటు రూ.30 లక్షల అప్పులు ఉన్నట్లు చెప్పారు. 12 కిలోల బంగారు అభరణాలు ఉన్నాయి. ఈయన పేరు మీద సొంత కారు లేదని, భార్య పేరిట ౪ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం 50 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని, బాచుపల్లిలో 6.28 ఎకరాలు, గాజులరామారంలో 1.05 ఎకరాలు, ఖానామెట్‌లో 18 గుంట లు, చందా నగర్‌లో 2.1ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నట్లు చూపించారు. రెండు వాణిజ్య భవనాలతో పాటు బాచుపల్లి, అమీర్‌పేట్‌లో నివాస గృహాలు ఉన్నట్లు చెప్పారు.

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రూ.1,240 కోట్లు, ఆయన సతీమణి సంగీతరెడ్డికి రూ.3,206 కోట్లు, కుమారుడికి రూ.108 కోట్ల ఆస్తులున్నాయి. 2014లో కొండా ఆస్తులు రూ.528 కోట్లు, 2019లో రూ.895 కోట్ల ఆస్తులున్నట్లు గతంలో ప్రకటించారు. గడిచిన ఐదేండ్లలో ఆయన ఆస్తులు 38శాతం పెరిగాయి.