30-07-2025 01:50:01 AM
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): కేజీబీవీ స్కూళ్లు, సమగ్రశిక్షలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేసేంతవరకు వారికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ర్ట ఉపాధ్యాయుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ర్టపతి ఉత్తర్వులుొో-2018 ప్రకారం పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను తీసుకురావాలని కోరారు. డీఎస్సీ నియామకాలు పొందిన ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం వర్తింపజేయాలని, రాష్ర్టంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ (పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులు మంజూరు చేయాలని ఆయన కోరారు.