30-07-2025 02:05:31 PM
హైదరాబాద్: గురుకుల పాఠశాలలను వేధిస్తున్న తీవ్రమైన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రాథమిక సౌకర్యాల కోసం విద్యార్థులు పాదయాత్రలు కూడా చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు(Former Minister Harish Rao) విమర్శించారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లో గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల నిర్వహించిన పాదయాత్రను హరీష్ రావు ప్రస్తావిస్తూ, తరగతి గదుల్లో ఉండాల్సిన పిల్లలు ఆహారం, నీరు, గౌరవం కోసం నిరసనలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఎన్నికల లాభం కోసం రాజకీయాలపై దృష్టి సారించి, భవిష్యత్ తరాలకు కీలకమైన విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు.
ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే రేవంత్ రెడ్డి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు? అని ప్రశ్నించారు. పరిపాలన గాలికి వదిలేసి, అనునిత్యం రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డికి(Revanth Reddy), కాంగ్రెస్ పార్టీకి గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవడం అమానవీయమన్నారు. తరగతి గదుల్లో ఉండాల్సిన భావి భారత విద్యార్థులను నడిరోడ్డు ఎక్కించిన దుర్మార్గ చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు.చదువుకోవాల్సిన పిల్లలను పట్టెడు అన్నం కోసం, తాగు నీళ్ళ కోసం పాదయాత్రలు చేసే దుస్థితిని కాంగ్రెస్ కలిగించిందన్నారు. “మాకు న్యాయం కావాలి” అని నినాదాలు చేసినందుకు పోలీసులను పెట్టి, బలవంతంగా డీసీఎంలలో విద్యార్థులను తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వెంటనే అలంపూర్‌ను సందర్శించి, విద్యార్థుల నుండి నేరుగా మెమోరాండం స్వీకరించి, దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల్లో(Government Residential Welfare School) పెరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు, విద్యార్థుల మరణాలు, ఇతర సమస్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక కోరినప్పటికీ ప్రభుత్వం నుండి ఎందుకు స్పందన రాలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి.. మీ పాలనలో రోజు రోజుకీ పతనమవుతున్న గురుకుల వ్యవస్థను గాడిన పెట్టాలని హరీశ్ రావు కోరారు.