30-07-2025 02:23:58 PM
హైదరాబాద్: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ(BRS Government) హయాంలో జరిగిన రూ. 700 కోట్ల గొర్రెల పంపిణీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం ఎనిమిది చోట్ల దాడులు నిర్వహించింది. ఈడీ బృందాలు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (TSSGDCF) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ సబావత్ రామచందర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ జి.కళ్యాణ్ సహా అనేక మంది అనుమానితులకు చెందిన ఇళ్ళు, ఇతర ప్రాంగణాలలో సోదాలు నిర్వహించాయి.
ఏసీబీ (Anti-Corruption Bureau) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (Prevention of Money Laundering Act) కింద దర్యాప్తు ప్రారంభించింది. 2017లో బీఆర్ఎస్ నేతృత్వంలో ప్రభుత్వం గొల్ల కురుమలకు సబ్సిడీపై గొర్రెలను సరఫరా చేసే లక్ష్యంతో ప్రారంభించిన గొర్రెల పంపిణీ, అభివృద్ధి పథకం (Sankalpa Rural Development Society)పై ఏసీబీ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి.
ఈ పథకం అమలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, నకిలీ లావాదేవీలు, బినామీ ఖాతాల ద్వారా నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించబడింది. ఈ పథకాన్ని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) 20 జూన్ 2017న ప్రారంభించారు. యూనిట్‌కు అయ్యే రూ.1.25 లక్షల ఖర్చులో ప్రభుత్వం 75 శాతం ఖర్చును అందిస్తుంది. 25 శాతం లబ్ధిదారుడు భరిస్తాడు. అయితే, అధికారులు, మధ్యవర్తులు నిధులను దుర్వినియోగం చేయడానికి ప్రారంభం నుండే కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది.