calender_icon.png 1 December, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలి..

01-12-2025 06:58:49 PM

నూతన టెండర్లు వెంటనే పిలవాలి..

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ₹26,000 చెల్లించడంతో పాటు నూతన టెండర్లను తక్షణమే పిలవాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ IHFMS టెండర్ల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం కొత్త టెండర్ల ప్రక్రియ చేపట్టి, కార్మికులకు న్యాయమైన కనీస వేతనం ₹26,000 అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, కార్మికులందరికీ EPF, ESI వివరాలను స్పష్టంగా తెలియజేయాలని, అపాయింట్మెంట్ లెటర్లు, ID కార్డులు అందజేయడంతో పాటు ఇతర సమస్యలు కూడా తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధన కోసం డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఆసుపత్రి ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 5న కోటి లోని మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లాలోని కార్మికులందరూ ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరు చిరంజీవి, కోశాధికారి నగేష్, కార్మికులు కృష్ణ, నీల, రాజయ్య, గంగన్న, కమల తదితరులు పాల్గొన్నారు.