01-12-2025 07:51:13 PM
చిరుమర్తి లింగయ్య సవాల్..
నకిరేకల్ (విజయక్రాంతి): దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రా… మళ్లీ 68 వేల మెజార్టీతో గెలిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సవాల్ విసిరారు. సోమవారం స్థానిక సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిరేకల్ నియోజకవర్గంలో నిరంకుశ పద్ధతులు, బెదిరింపుల రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడే తీర్పును ప్రజలు ఇవ్వాలని ఆయన కోరారు. నకిరేకల్ కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనను తీవ్రంగా విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు లేకుండా నేనొక్కడినే ఉండాలన్న ధోరణితో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో నకిరేకల్‌లో చేసిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా అభ్యర్థులను బెదిరించడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని అన్నారు. 68 వేల మెజార్టీతో గెలిచిన మీరు ప్రజలకు చేసిన అభివృద్ధిని ఏమిటో వివరించాలని కోరారు. భయపెట్టి గెలవాలని కాకుండా ధైర్యంగా పోటీ గెలవాలని ఆయన సూచించారు. కేతపల్లి నుండి రామన్నపేట వరకు ప్రతీ గ్రామంలో అభ్యర్థులపై ఒత్తిడి, బెదిరింపులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రామన్నపేటలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తిని తీవ్ర ఒత్తిడికి గురిచేశారని అన్నారు. గొల్లగూడెంలో ఏకగ్రీవం పేరుతో నాటకం ఆడారని విమర్శించారు.
ఈ సందర్భంలో తీవ్ర సవాల్ విసురుతూ..
“దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రండి. మళ్లీ 68 వేల మెజార్టీతో గెలిస్తే నేను రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటాను” అని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకటరెడ్డి, పిండం సదానందం, రావిరాల మల్లయ్య, దైద పరమేశం, గుర్రం గణేష్, టి. ప్రభాకర్ రావు, పల్లె విజయ్, రాచకొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.