calender_icon.png 1 December, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల వ్యయముల ఖాతా నిర్వహణ పత్రాలను నామినేషన్ వేసిన వారికి అందజేయాలి

01-12-2025 07:32:26 PM

జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్..

గద్వాల: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన ప్రతి అభ్యర్థికి ఎన్నికల వ్యయముల ఖాతా నిర్వహణ పత్రాలను విధిగా అందజేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. సోమవారం మల్దకల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన మల్దకల్ 1, ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మల్దకల్ 2, తాటికుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్స్ ప్రకారం సంబంధిత అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించాలనీ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. పోటీ చేయు అభ్యర్థుల నుంచి అవసరమైన ధృవపత్రాలను తీసుకొని విధిగా దరఖాస్తుకు జత పరచాలని, డిక్లరేషన్ తప్పనిసరిగా  తీసుకోవాలన్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థులతో నిర్దేశిత డిపాజిట్ తీసుకొని తగిన రసీదును ఇవ్వాలని పేర్కొన్నారు.

నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలని సూచించారు. నామినేషన్ వేసే అభ్యర్థులు సంబంధిత గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులను పెండింగ్ లేకుండా కట్టించుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఇతర అంశాలపై ముద్రించిన పత్రాలను నామినేషన్ వేసిన వారికి అందజేయాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటరు జాబితాను పరిశీలించారు. నామినేషన్ వేసిన అభ్యర్థుల వివరాలను నోటీసు బోర్డులో ఏ రోజుకు ఆ రోజు అతికించాలన్నారు. హెల్ప్ డెస్క్ ను పరిశీలించి నామినేషన్ వేసేందుకు వచ్చే వారికి అవసరమైన సలహాలు అందజేయాలని అక్కడి సిబ్బందికి సూచించారు. నామినేషన్స్ వేసిన అభ్యర్థుల వివరాలను టీ పోల్ యాప్ లో నమోదు చేయాలన్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత నామినేషన్ వేసేందుకు వచ్చేవారిని కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని, నిర్దేశిత సమయంలోగా కేంద్రం లోపల ఉన్న వారి నుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలన్నారు. ఈ పర్యటనలో మల్దకల్ మండలం ఎంపీడీవో ఆంజనేయ రెడ్డి, ఎంఈఓ సురేష్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.