calender_icon.png 2 November, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాశీబుగ్గ ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు: ఏపీ దేవాదాయ శాఖ మంత్రి

01-11-2025 02:17:13 PM

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kasibugga Venkateswara Temple ) శనివారం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించారు. తొక్కిలాట దుర్ఘటనపై దేవాదాయ శాఖ  మంత్రి ఆనం రామనారాయణ(Minister Anam Ramanarayana) రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి ఆనం ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ... శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదని పేర్కొన్నారు. ఈ ప్రైవేట్ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో లేదు. హరిముకుంద్‌పండా అనే ఒక వ్యక్తి తనకు చెందిన 12 ఎకరాల సొంత భూమిలో తన సొంత నిధులతో నిర్మించిన ఒక ప్రైవేటు దేవాలయం అన్నారు. ఈ దేవాలయ సామర్థ్యం 2,000 నుంచి 3,000 మంది వరకు మాత్రమే ఉందన్న మంత్రి ఈరోజు ఏకాదశి కావడంతో ఒక్కసారిగా 25,000 మంది వరకు రావడం జరిగిందన్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం కానీ.. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం కానీ సదరు వ్యక్తి చేయలేదని తెలిపారు. జరిగిన దుర్ఘటనకు ఇదే కారణమని సూచించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి  మెరుగైన చికిత్స అందిస్తున్నామని వివరించారు.

కాశీబుగ్గలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాట మృతుల్లో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నాడు. కార్తీక మాసం సందర్భంగా ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయంలోకి గుమిగూడడంతో ఈ విషాదం సంభవించింది. సామర్థ్యానికి మించి జనం తరలివచ్చారు. మొదటి అంతస్తులోని స్వామివారి దర్శనం కోసం మెట్లు ఎక్కుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు మెట్లు ఎక్కుతుండగా రద్దీ కారణంగా రెయిలింగ్ ఊడిపడింది. రెయిలింగ్ ఊడిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడి 9 మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన 25 మందికి పలాస ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. మృతులను వై. చిన్నమ్మి, ఆర్. విజయ, ఎం.నేలమ్మ, డి. రాజేశ్వరి, సీహెచ్. పశోదామిగా గుర్తించారు. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పండా 12 ఎకరాల సొంత భూమిలో గుడిని నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నెలలో దర్శనాలు ప్రారంభించారు. నాలుగేళ్ల క్రితం ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. సుమారు రూ. 20 కోట్లతో హరిముకుంద్ పండా ఆలయాన్ని నిర్మించారు.