calender_icon.png 4 August, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు పాటించని ప్రైవేట్ కళాశాలపై చర్యలేవి..?

04-08-2025 04:40:27 PM

చోద్యం చూస్తున్న ఇంటర్ విద్యా అధికారులు

హన్మకొండ,(విజయక్రాంతి): హనుమకొండ పట్టణంలో అనుమతులు లేకుండా నడుస్తున్న ఇంటర్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోక పోవడం చూస్తే హన్మకొండ జిల్లా  ఇంటర్మీడియట్ విద్యాధికారి తన శాయశక్తులా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తుంది. అనుమతులు లేని కళాశాలలపై కొరడా ఝుళిపించాల్సిన ఆ అధికారి చర్యలు తీసుకోకుండా వారికే పరోక్షంగా సహకరిస్తున్నట్లుగా సమాధానం చెపుతూన్నట్లు తెలుస్తూంది.

హన్మకొండలో ఒక్క అనుమతితో అనేక బ్రాంచులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాల లకు నోటీసులు జారీ చేసి నట్లే చేసి గమ్మున ఉండటం చూస్తే డిఐఈఓ నేను కొట్టినట్లు చేస్తా నువ్వు ఏడ్చినట్లు చెయ్యి అన్న చందాన ప్రవర్తిస్తునట్లుగా విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేస్తే కంటి తుడుపు చర్యగా ఓ నోటీసు జారీ చేసి, మెతక విధానం ప్రదర్శిస్తున్నట్లుగా కనబడుతుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఒకే అనుమతితో అనేక బ్రాంచీలు నెలకొల్పి వందల కొద్ధి అడ్మిషన్లు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలపై ఏ విధమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.

విద్యా సంస్థల నిబంధనల అతిక్రమణ విషయంలో హన్మకొండ డీ ఐ ఈ ఓ గోపాల్ దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ చర్యల పేరుతో షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఏవిధమైన మార్పు కనిపించటం లేదు. దీంతో ఇప్పటి వరకు కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఏ విధమైన మార్పు కనిపించడం లేనందున అనుమతిలేని కళాశాలలకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నుండి  ఆరోపణలు వస్తున్నాయి. హనుమకొండ పట్టణంలో అనుమతులు లేని కళాశాలలపై చర్యలు తీసుకోవడానికి డిఐఈఓ ఎందుకు వెనుకాడుతున్నారని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన హనుమకొండ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలను గుర్తించి  తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

ఒత్తిడి తట్టుకో లేక ఆత్మహత్యలు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులపైన ఒత్తిడి కత్తులు వేలాడుతున్నాయా అనే అనుమానం వ్యకమవుతుంది. చదువులో రాణించాలని చేసే ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు లోలోపల మధనపడుతూ.. ఆ ప్రెషర్‌ను భరించలేక.. తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ర్యాంకుల వేటలో తమ స్వలాభం కోసం మార్కెట్‌లో నంబర్ వన్‌గా నిలవాలనే ప్రయత్నంలో భాగంగా స్టూడెంట్స్‌పైన కొన్ని విద్యా సంస్థలు విపరీతమైన ఒత్తిడి చేస్తున్నాయని, చదువుకోవాల్సిందేనని వారిపై భారం మోపుతుండటంతో వారు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

తాజాగా హనుమకొండ లోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీకి సంబంధించిన వసతిగృహంలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్నారు. ఫ్యాన్ కు ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాగా, చదువులో రాణించలేక ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు.సదరు విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ లో ఒత్తిడికి గురవుతిన్నట్లుగా పేర్కొనడం శోచనీయం..ఎప్పటికైనా అధికారుల  పర్యవేక్షణ నిరంతరం కొనసాగిస్తూ, విద్యార్థులపై మానసిక ఒత్తిడి కలిగించే కళాశాలపై చర్యలు తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు.