24-11-2025 07:49:03 PM
భైంసా (విజయక్రాంతి): ఇండ్లు లేని పేదలందరికీ సొంత ఇంటి కలను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం బైంసా మండలం ఎగ్గాం గ్రామంలో కండేక కవిత, ధర్మపాల్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో ఒకదాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇండ్లు లేని పేద కుటుంబాల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి అర్హ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. పేదల గృహసాధన లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులను శాలువాలతో సన్మానించారు. ప్రారంభోత్సవంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.