24-11-2025 07:20:43 PM
లక్ష్మీపురంలో షాదీఖానా పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..
కోదాడ: అభివృద్ధిలో రాష్ట్రంలోనే కోదాడ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ నియోజకవర్గంలో మునగాల, కోదాడ పట్టణ, కోదాడ రూరల్, చిలుకూరు మండలాలలో ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మొదటగా మునగాల మండలం కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మునగాలలో 100 శాతం రాయితీపై ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి చేప పిల్లలను చెరువులో వదిలిపెట్టారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
తదనంతరం కోదాడ పట్టణంలోని సాలార్జంగ్ పేటలోని సాజ్దా ప్లాట్ ఫారం గ్రౌండ్ లెవెలింగ్, వెడల్పు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 301 లబ్ధిదారులకు 93 లక్షల 86 వేల 500 విలువ గల సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. లక్ష్మీపురం కాలనీ సమీపంలోని మూడు కోట్లతో నిర్మాణం చేపట్టిన షాదీ ఖానాకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోదాడ మండల పరిధిలోని కూచిపూడిలో టీజీఎస్పీడీసీఎల్ నిధులు 2.59 కోట్లతో, చిలుకూరు మండలంలోని కొండాపురంలో టీజీఎస్పీడీసీఎల్ 2.58 కోట్లతో 33/11 కేవీ, విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించారు.
అవినీతి రహిత పాలన అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారులకు అందే విధంగా సంబంధిత అధికారులు కృషి చేయాలని సూచించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, అనంతగిరి మండల అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి, మోతే మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, చిలుకూరు మండల అధ్యక్షులు కీత వెంకటేశ్వర్లు, మునగాల మండల అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి, అల్తాఫ్ హుస్సేన్, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.